-

యెమెన్ పోరులో 114 మంది మృతి

7 Apr, 2015 01:12 IST|Sakshi

మిలిటెంట్లు, సేనల మధ్య కొనసాగుతున్న ఘర్షణలు
మరో 1,052 మంది భారతీయులను కాపాడిన ప్రభుత్వం

 
ఆడెన్: యెమెన్‌లో రక్తపుటేర్లు పారుతూనే ఉన్నాయి. హుతీ మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య సాగిన భీకర పోరులో సోమవారం ఆడెన్‌లో 114 మంది చనిపోయారు. ఈ తీరప్రాంత పట్టణాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు మిలిటెంట్లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. వారిని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ బలగాలు ప్రతిఘటిస్తున్నాయి. మృతుల్లో 19 మంది తీవ్రవాదులు, 15 మంది అధ్యక్షుడి మద్దతుదారులు ఉన్నట్లు తెలుస్తోంది. 53 మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అబ్యాన్ రాష్ట్రంలో కూడా ఏడుగురు పౌరులు మరణించారు.

లాహ్జ్‌కు సమీపంలో సంకీర్ణ సేనలు తాజాగా జరిపిన వైమానిక దాడిలో 10 మంది రెబెల్స్ చనిపోయారు. ఇరుపక్షాలు తక్షణమే ఒక ఒప్పందానికి వచ్చి కాల్పులకు విరమణ ప్రకటించాలని రెడ్‌క్రాస్ సొసైటీ విజ్ఞప్తి చేసింది. పౌరులకు తాగునీరు, ఆహారం, వైద్యసాయం అందించేందుకు సహకరించాలని కోరింది. కాగా, భారత్ సోమవారం యెమెన్ నుంచి మరో 1052 మందిని రక్షించింది. ఇప్పటివరకు ఆ దేశం నుంచి కాపాడిన భారతీయుల సంఖ్య 3,300 కు చేరింది. యెమెన్ నుంచి భారతీయుల తరలింపునకు కృషి చేస్తున్న ప్రభుత్వ విభాగాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ప్రజలకు సాయం అం దించాలన్న ప్రభుత్వ వైఖరికి ఇది అద్దం పడుతోందన్నారు. భారతీయులతోపాటు ఆపదలో ఉన్న విదేశీయులనూ యెమెన్ నుంచి కాపాడుతున్నారంటూ అధికారులను కొనియాడారు.
 

మరిన్ని వార్తలు