సింధు విజయంపై అనుచిత వ్యాఖ్యలు చేసి..

23 Aug, 2016 18:06 IST|Sakshi
సింధు విజయంపై అనుచిత వ్యాఖ్యలు చేసి..

న్యూఢిల్లీ: ఒలింపిక్స్ బ్యాడ్మింటన్లో రజత పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన పీవీ సింధుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. సగటు అభిమాని నుంచి ప్రధాని, రాష్ట్రపతి వరకు అందరూ తెలుగుతేజాన్ని అభినందించారు. కాగా మలయాళీ అవార్డు దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్ ఫేస్బుక్లో సింధు విజయాన్ని అవహేళన చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది.

 'సింధు విజయాన్ని ప్రతి ఒక్కరూ సంబరాలు చేసుకుంటున్నారు. దీన్ని అంతగా సెలెబ్రేట్ చేసుకోవడానికి ఏముంది?' అని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో పాటు సింధు విజయంపై మరో అభ్యంతరకరమైన కామెంట్ చేశాడు. దీనిపై నెటిజెన్లు తీవ్రంగా స్పందించారు. శశిధరన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు. నెటిజెన్ల నుంచి విమర్శలు రావడంతో శశిధరన్ వివరణ ఇచ్చాడు. తన వ్యాఖ్యలను సరిగా అర్థం చేసుకోలేదని చెప్పాడు.

రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన సింధుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు వివిధ రాష్ట్రాలు, క్రీడా సంఘాలు, పలువురు వ్యక్తులు భారీ పారితోషకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వం సింధు, కోచ్ గోపీచంద్లను ఘనంగా సన్మానించాయి.

మరిన్ని వార్తలు