'ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు'

11 Nov, 2016 01:15 IST|Sakshi

జీఎస్టీ అమలుపై జైట్లీని కలసిన సినీ నిర్మాతలు
సాక్షి, న్యూఢిల్లీ:
వచ్చే ఏడాది నుంచి అమలు కానున్న జీఎస్టీ వల్ల ప్రాంతీయ చిత్రాలు నష్టపోకుండా చూస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ హామీ ఇచ్చినట్టు సినీ నిర్మాతలు డి.సురేశ్‌బాబు, సి.కల్యాణ్‌ తెలిపారు. గురువారం ఢిల్లీలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో వీరు జైట్లీని కలిశారు. ప్రాంతీయ చిత్రాలు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే నడుస్తు న్నాయని, రాష్ట్రాల్లో చిన్న సినిమాలకు 7 శాతం, పెద్ద చిత్రాలకు 14 శాతం పన్ను వసూలు చేస్తున్నారని, బాలీవుడ్, హాలీవుడ్‌ చిత్రాలపై 24శాతం పన్ను వసూలు చేస్తు న్నట్టు వివరించారు. జీఎస్టీ అమలు చేయడం వల్ల అన్ని పరిశ్రమల చిత్రాలకూ ఒకే పన్ను అమలు కానున్న నేపథ్యంలో.. ప్రాంతీయ చిత్రాలు దీని వల్ల నష్టపోతా యని జైట్లీకి వివరించారు.

జీఎస్టీ అమలుకు సంబంధించి ఇప్పటికే శ్లాబులు నిర్ణయిం చడంతో, వీటిలో చిత్ర పరిశ్రమను దేనికిందకు తెస్తారో ఇంకా నిర్ణయించాల్సి ఉంది కాబట్టి.. ప్రాంతీయ చిత్రాలపై ఎలాంటి ప్రభావం పడకుండా పన్నులను నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై జైట్లీ సానుకూలంగా స్పందించి ప్రాంతీయ చిత్రాలపై ప్రభావం పడకుండా పన్నులు నిర్ణయిస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. ప్రాంతీయ చిత్రాలకు ఒకే విధమైన పన్ను శ్లాబ్‌లను విధించకుండా చూడాలన్న విజ్ఞప్తికి జైట్లీ సానుకూలంగా స్పందించినుట్ట కేటీఆర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు