చిరుతల సంఖ్య తేలింది

7 Sep, 2015 12:04 IST|Sakshi
చిరుతల సంఖ్య తేలింది

చిరుతపులుల జనసంఖ్యపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. స్వాతంత్ర్యానంతరం వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా చేపట్టిన చిరుత పులుల జనగణనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం భారత్లో 12 వేల నుంచి 14 వేల చిరుతపులులు ఉన్నాయని, పులుల సంఖ్య (7,910)తో పోల్చిచూస్తే ఈ సంఖ్య మెరుగైనదని వైల్డ్లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్ట్, చిరుతపులుల జనగణన ముఖ్యఅధికారి యదువేంద్రదేవ్ ఝా చెప్పారు. డెహ్రాడైన్లో జరిగిన వార్షిక పరిశోధనా సదస్సులో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

చిరుతల సంచారం అధికంగా ఉండే ప్రాంతాలను గుర్తించి, అక్కడక్కడా నైట్విజన్ కెమెరాలను ఏర్పాటుచేసి ఫోటోలు తీశామని, ఇతర ప్రాంతాల్లోనూ వివిధ మార్గాల ద్వారా ఫొటోలను సేకరించామని, అన్నింటిని క్రోడీకరించిన పిదప దేశంలో చిరుత పులుల రమారమి జనాభాను అంచనావేయగలిగామని ఝా చెప్పారు. పులుల జనగణనను కూడా ఇవే పద్దతుల ద్వారా సేకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కాగా, ఈశాన్య భారతంలో ఇంకా సర్వే చేపట్టలేదని, ఆ వివరాలను కూడా కూడితే చిరుతపులుల జనసంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 343 చిరుతపులులు ఉండగా మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 1,817, కర్ణాటకలో 1,129, మహారాష్ట్రలో 905, ఛత్తీస్గఢ్ లో 846, తమిళనాడులో 815, ఉత్తరాఖండ్ లో 703,  హిమాలయ ప్రాంతంలో 300 నుంచి 400 చిరుతపులులు జీవిస్తున్నాయి.

మరిన్ని వార్తలు