రాష్ట్రాలకు 42 శాతం వాటా

25 Feb, 2015 06:49 IST|Sakshi
రాష్ట్రాలకు 42 శాతం వాటా

14వ ఆర్థిక సంఘం సిఫారసులకు కేంద్రం ఆమోదం
13వ ఆర్థికసంఘం సిఫారసులకన్నా ఏకంగా 10 శాతం పెంపు
రాష్ట్రాల వాటా మొత్తంలో తెలంగాణకు 2.437%, ఏపీకి 4.305%
తెలంగాణ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 4,837 కోట్ల గ్రాంటు
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 7,788 కోట్ల గ్రాంటు
తెలంగాణ పట్టణ స్థానిక సంస్థలకు రూ. 2,711 కోట్లు
ఏపీ పట్టణ స్థానిక సంస్థలకు రూ. 2,908 కోట్లు
ఏపీకి రెవెన్యూ లోటు భర్తీ కోసం రూ. 22,113 కోట్లు గ్రాంటు
సిఫారసుల నివేదిక పార్లమెంటుకు సమర్పణ
రాష్ట్రాల వాటా పెరిగినందున కేంద్ర పథకాల పాత్ర తగ్గుతుంది: జైట్లీ
 
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ జరగాల్సిన కేంద్ర పన్నుల వసూళ్లలో 42 శాతం వాటాను రాష్ట్రాలకు కేటాయించాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. 13వ ఆర్థిక సంఘం 32 శాతం వాటాను సిఫారసు చేయగా.. తాజాగా 14వ ఆర్థిక సంఘం మరో పది శాతం పెంచుతూ 42 శాతానికి సిఫారసు చేసింది. ఈ వాటా నుంచి రాష్ట్రాల సామర్థ్యం, పనితీరు, జనాభా, వెనుకబాటుతనం తదితర అంశాల ఆధారంగా వాటికి విడివిడిగా వాటాలు నిర్ధారించింది. రాష్ట్రాలకు కేటాయించిన మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌కు 4.305 శాతం, తెలంగాణకు 2.437 శాతం వాటాగా ఆర్థిక సంఘం నిర్ణయించింది.


అలాగే సేవా పన్ను (సర్వీస్ ట్యాక్స్)లో ఏపీ వాటా 4.398 శాతంగా, తెలంగాణ వాటా 2.499 శాతంగా నిర్ధారించింది. వీటికి అదనంగా స్థానిక సంస్థలకు గ్రాంట్లను కూడా సిఫారసు చేసింది. అదే సమయంలో రెవెన్యూ లోటు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ సహా 11 రాష్ట్రాలకు ఐదేళ్ల పాటు రూ. 1,94,821 కోట్ల గ్రాంట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. ఇందులో ఏపీకి ఐదేళ్లకు కలపి రూ. 22,113 కోట్లు కేటాయించింది. డాక్టర్ యాగా వేణుగోపాల్‌రెడ్డి (వై.వి.రెడ్డి) చైర్మన్‌గా ఏర్పాటైన 14వ ఆర్థికసంఘం డిసెంబర్ 15న తన సిఫారసుల నివేదికను సమర్పించగా.. దీనిని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ నివేదికను కేంద్రం ఆమోదించినట్టు ఆర్థికమంత్రి సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సిఫారసులు 2015 ఏప్రిల్ 1 నుంచి 2020 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి.
 
 పది శాతం పెరిగిన రాష్ట్రాల వాటా...
 13వ ఆర్థిక సంఘం పన్నుల రాబడిలో రాష్ట్రాలకు 32 శాతం వాటాను సిఫారసు చేయగా.. 14వ ఆర్థిక సంఘం పది శాతం పెంచుతూ 42 శాతం సిఫారసు చేసింది. గత ఆర్థిక సంఘాలు ఎప్పుడూ ఒకటి, రెండు శాతానికి మించి పెంచుతూ సిఫారసు చేయలేదని.. తొలిసారిగా 10 శాతం మేరకు పెంచుతూ 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని.. దీనిని ఆమోదిస్తున్నామని అరుణ్‌జైట్లీ తెలిపారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికలకు ముందు ప్రచార సభల్లో ఇదే చెప్పారు. రాష్ట్రాలకు ఎక్కువ వాటా ఉండాలని, నేరుగా రాష్ట్రాలే వాటిని వినియోగించుకునే స్వేచ్ఛ ఉండాలని చెప్పారు.
 
 దానికి అనుగుణంగానే 14వ ఆర్థిక సంఘం సిఫారసులు రావడం సంతోషకరం’’ అని పేర్కొన్నారు. ‘‘రాష్ట్రాలు కోరినట్టుగానే పన్నుల్లో వాటా పెరిగింది. అలాగే కేంద్ర పథకాల పాత్ర కూడా తగ్గుతుంది..’’ అని ఆయన వివరించారు. 1971 నాటి జనాభాను, అప్పటి నుంచి జనాభాలో వచ్చిన మార్పులను, ఆదాయ వ్యత్యాసాలను, అటవీ విస్తీర్ణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ 42 శాతం వాటా 14వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు కేటాయింపులు జరిపిందని మంత్రి తెలిపారు.
 
 స్థానిక సంస్థలకు నిధులిలా...
 పన్నుల్లో వాటాతో పాటు స్థానిక సంస్థలకు గ్రాంట్ల రూపంలో కేంద్రం ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఆ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ స్థానిక సంస్థలకు 2015-20 వరకు మొత్తం రూ. 7,788.68 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 2,908.64 కోట్లు ఇవ్వాలని సూచించింది. అదే సమయంలో తెలంగాణకు గ్రామీణ స్థానిక సంస్థలకు ఐదేళ్లకు కలపి రూ. 4,837.75 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 2,711.12 కోట్లు చొప్పున కేటాయించాలని సిఫారసు చేసింది. వీటితోపాటు పనితీరు ఆధారిత గ్రాంట్లను కూడా స్థానిక సంస్థలకు కేటాయించాలని చెప్పింది. ఆ ప్రకారం ఏపీలోని గ్రామీణ స్థానిక సంస్థలకు ఐదేళ్ల పాటు రూ. 865.41 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 727.16 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేసింది. అదేరీతిలో తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 537.53 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ. 677.78 కోట్లు ఇవ్వాలంది.
 
 లోటు భర్తీ కోసం గ్రాంట్లు...
 ఆంధ్రప్రదేశ్ సహా 11 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ కోసం ఐదేళ్ల పాటు గ్రాంట్లను 14వ ఆర్థికసంఘం సిఫారసు చేసింది. దీనిలో భాగంగా ఏపీకి మొత్తం రూ. 22,113 కోట్లు కేటాయించింది. 2015-16లో రూ. 6,609 కోట్లు, రెండో సంవత్సరంలో రూ. 4,930 కోట్లు, మూడో సంవత్సరంలో రూ. 4,431 కోట్లు, నాలుగో సంవత్సరంలో రూ. 3,644 కోట్లు, ఐదో సంవత్సరంలో రూ. 2,499 కోట్లు చొప్పున కేటాయించాలని సిఫారసు చేసింది. కొన్ని రాష్ట్రాలకు తొలి రెండు సంవత్సరాలే కేటాయించింది.
 
 తెలంగాణకు రెవెన్యూ లోటు లేనందున ఈ జాబితాలో చోటు కల్పించలేదు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడే రెవెన్యూ లోటు భర్తీకి తగిన సిఫారసులు చేయాలని ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం చేసిన సూచనను 14వ ఆర్థిక సంఘం పరిగణనలోకి తీసుకుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. అరుణ్‌జైట్లీ సమాధానమిస్తూ పరిగణనలోకి తీసుకున్నందునే ఏపీకి రెవెన్యూ లోటు భర్తీకి గ్రాంట్లు కేటాయించిందని చెప్పారు.

మరిన్ని వార్తలు