అధిక డివిడెండ్‌లు కావాలి

19 Oct, 2013 01:49 IST|Sakshi
అధిక డివిడెండ్‌లు కావాలి

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ కంపెనీ(పీఎస్‌యూ)లు ఈ ఏడాది ప్రభుత్వానికి డివిడెండ్ చెల్లింపులను పెంచాల్సిందేనని ఆర్థిక మంత్రి పి. చిదంబరం స్పష్టం చేశారు. శుక్రవారమిక్కడ పీఎస్‌యూ చీఫ్‌లతో భేటీ అనంతరం ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు. ‘గత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూలు కేంద్రానికి ఇచ్చిన డివిడెండ్‌లతో పోలిస్తే ఈ ఏడాది ఈ మొత్తం పెరగాల్సిందే. గతేడాదికంటే తక్కువగా చెల్లిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం’ అని చిదంబరం తేల్చిచెప్పారు. ఓఎన్‌జీసీ, ఇండియన్ ఆయిల్, గెయిల్, సెయిల్, ఎన్‌టీపీసీ, కోల్‌ఇండియా తదితర భారీ పీఎస్‌యూల అధిపతులతో చిదంబరం సమావేశమయ్యారు.

ఈ ఏడాది(2013-14) ద్రవ్యలోటును జీడీపీలో 4.8 శాతానికి కట్టడి చేయాలన్న లక్ష్యానికి పూర్తిగా కట్టుబడిఉన్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్థిక మందగమనం కారణంగా కొన్ని విభాగాల నుంచి ఆదాయం తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని, అదేవిధంగా పీఎస్‌యూల్లో వాటా విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్)లో కొరతను అధిగమించాలంటే అధిక డివిడెండ్‌లు ఆవశ్యకమని చెప్పారు. కాగా, ఈ ఏడాది డివిడెండ్ చెల్లింపుల లక్ష్యాన్ని చేరుకోగలమనే విశ్వాసాన్ని ఆర్థిక శాఖ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక డివిడెండ్‌లను కోరే అవకాశం లేదనేది ఆయా వర్గాల సమాచారం. జనవరిలో పరిస్థితిని సమీక్షించనున్నట్లు కూడా వారు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌యూల నుంచి ప్రభుత్వానికి రూ.55,443 కోట్ల మొత్తం డివిడెండ్‌లు, లాభాల రూపంలో లభించింది. ఈ ఏడాది లక్ష్యం రూ.73,866 కోట్లు.
 
 పెట్టుబడులపైనా చర్చ...
 ఆర్థిక వ్యవస్థ వృద్ధికి చేయూతనిచ్చే చర్యల్లో భాగంగా పీఎస్‌యూల పెట్టుబడుల ప్రణాళికలపై కూడా చిదంబరం చర్చించారు. దాదాపు అన్ని పీఎస్‌యూలు తమ పెట్టుబడి ప్రణాళికలను సాకారం చేసేదిశగా ముందుకెళ్తున్నాయని, అరడజను కంపెనీలు మాత్రం వెనుకబడినట్లు చిదంబరం ఈ సందర్భంగా చెప్పారు. జనవరిలో వీటి పనితీరును సమీక్షిస్తామన్నారు. తమ కంపెనీ పనితీరుపట్ల ఆర్థిక మంత్రి సంతృప్తిని వ్యక్తం చేశారని భేటీ అనంతరం ఓఎన్‌జీసీ చైర్మన్ సుధీర్ వాసుదేవ పేర్కొన్నారు. 2013-14లో రూ.35 వేల కోట్ల పెట్టుబడులను వెచ్చించాలనేది తమ ప్రణాళిక అని, ప్రథమార్ధంలో రూ.14,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ఆయన వివరించారు. సెయిల్ చైర్మన్ సీఎస్ వర్మ కూడా ఈ ఏడాది పెట్టుబడుల లక్ష్యాన్ని(రూ.11,500 కోట్లు) చేరుకుంటామన్న విశ్వాసం వ్యక్తం చేశారు. తొలి ఆరు నెలల్లో 87 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామన్నారు. కాగా, ఈ ఏడాది కేంద్రం రూ.40 వేల కోట్లను డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా సమీకరించాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా, ఇప్పటిదాకా కేవలం రూ.1,400 కోట్లను మాత్రమే సమీకరించడం గమనార్హం.

మరిన్ని వార్తలు