కెనడా స్కూల్ వద్ద కాల్పులు.. నలుగురి మృతి

24 Jan, 2016 02:04 IST|Sakshi
కెనడా స్కూల్ వద్ద కాల్పులు.. నలుగురి మృతి

ఒట్టావా: పశ్చిమ కెనడాలోని ఓ పాఠశాల వద్ద శనివారం కాల్పులు హోరెత్తాయి. సస్కట్‌చెవాన్ ప్రావిన్స్‌కు చెందిన లాలొచెలోని ఓ కమ్యూనిటీ పాఠశాల వద్ద దుండగుడు ఒకడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆగంతకుడిని పోలీసులు అరెస్టుచేశారు. అతని వివరాలుగానీ, మృతులు, ఇతర బాధితుల వివరాలనుగానీ పోలీసులు వెల్లడించలేదు. ఘటనపై లాలొచె పాఠశాలకు చెందిన విద్యార్థులు స్పందిస్తూ.. తాము ఆరేడుసార్లు తుపాకి పేలిన శబ్దాలను విన్నామని చెప్పారు. మరోవైపు, తుపాకీతో పాఠశాల వద్దకు వెళుతున్న ఒక విద్యార్థిని చూసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఉన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడెయి ఘటనపై స్పందిస్తూ ఐదుగురు మరణించారని, ఇద్దరు గాయపడ్డారని చెప్పారు. ఈ సంఘటన తల్లిదండ్రులందరికీ ఒక పీడకల లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే చనిపోయింది నలుగురేనని ఆ తరువాత విడుదల చేసిన ప్రకటనలో రాయల్ కెనడియన్ మౌంటెడ్(ఆర్‌సీఎం) పోలీసు ప్రతినిధి తెలిపారు. కెనడాలో 1989, డిసెంబర్ 6న 25 ఏళ్ల వ్యక్తి మాంట్రియల్‌లోని ఓ పాలిటెక్నిక్ స్కూలులోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో పదిమంది బాలికలతోసహా 14 మంది చనిపోయారు. ఆ తరువాత కెనడాలో ఓ పాఠశాలవద్ద కాల్పులు చోటు చేసుకోవడం ఇదే ప్రథమం.

మరిన్ని వార్తలు