ముంబై ఫిల్మ్‌సిటీలో భారీ అగ్నిప్రమాదం

26 Sep, 2013 02:58 IST|Sakshi

సాక్షి ముంబై: గోరేగావ్‌లోని ఫిల్మ్‌సిటీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అగ్నిమాపక దళానికి చెందిన ఐదు వాహనాలు, ఐదు నీటి ట్యాంకర్లు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే ఎటువంటి ప్రాణహాని జరగలేదు. కలర్స్ టీవీ చానల్‌లో ప్రసారమవుతున్న కామెడీ నైట్ విత్ కపిల్ ధారావాహిక ఎందరినో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఎప్పటిలాగే ఉదయం సుమారు 8.15 గంటలకు ఈ ధారావాహిక కోసం చిత్రీకరణ ప్రారంభమవుతుం డగా స్టేజీ వెనక భారీ శబ్దం వచ్చింది.

ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. ఈ స్టూడియోలో అనేక షూటింగ్‌లు జరుగుతుంటాయి. ఇందుకోసం ఏర్పాటుచేసే భారీ సెట్లకు ఎక్కువ శాతం కట్టెలు, చెక్కలనే వినియోగిస్తారు. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చుట్టుపక్కలున్న సెట్లను ముందుజాగ్రత్తగా తొలగించారు.     అయితే ఈ ప్రమాదానికి కారణంతోపాటు నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు