శాన్‌డియాగో చెలరేగిన మంటలు

14 May, 2014 21:33 IST|Sakshi
మంటలను ఆర్పేందుకు పైనుంచి హెలీకాప్టర్ ద్వారా నీటిని దారపోస్తున్న దృశ్యం

శాన్‌డియాగో:  అమెరికాలోని శాన్‌డియాగో ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో  కార్చిచ్చు చెలరేగడంతో దాదాపు 20 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శాంతా బార్బరా కౌంటీకి 400 కిలోమీటర్ల దూరంలో సైతం మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. అక్కడి నుంచి 1200 కుటుంబాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ మంగళవారం కార్చిచ్చు చెలరేగింది. అయితే, రెండు ప్రాంతాల్లోనూ చీకటిపడే వేళకు మంటలు చల్లారడంతో సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారు తమ తమ ఇళ్లకు వెళ్లవచ్చని అధికారులు సూచించారు.

మంటల  కారణంగా ఇళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఎవరూ గాయపడలేదు. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి ఉండటంతో మంటలను చల్లార్చేందుకు అగ్నిమాపక సిబ్బంది కొంత ప్రయాసపడ్డారు. మంటలను అదుపు చేయడానికి హెలీకాప్టర్ల ద్వారా నీటిని పోశారు.  శాన్‌డియాగో సమీపంలోని రాంకో బెర్నార్డో అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు శరవేగంగా 280 హెక్టార్ల మేరకు విస్తరించాయి. మంటలు ఇళ్ల వరకు రావడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడి వారిని హుటాహుటిన తరలించి, మంటలను అదుపు చేశారు. కొంత ప్రయాసపడ్డా, సాయంత్రంలోగా మంటలను సమర్థంగానే అదుపు చేయగలిగామని శాన్‌డియాగో అగ్నిమాపక విభాగాధిపతి జేవియర్ మయినార్ చెప్పారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు