ఆకాశమే హద్దుగా...

18 Feb, 2018 00:23 IST|Sakshi
భారత వాయు సేనలో శిక్షణ పొందుతున్న అవనీ చతుర్వేది, భావనా కాంత్‌, మోహనా సింగ్‌

అవకాశం లభించాలేగానీ ఆకాశమే మాకు హద్దు అంటున్నారు భారత మహిళామణులు... అవనీ చతుర్వేది, భావనా కాంత్‌, మోహనా సింగ్‌. దేశంలోనే మొదటి మహిళా సూపర్‌సోనిక్‌ జెట్‌ ఫైటర్లుగా చరిత్ర సృష్టించబోతున్నారు. ప్రస్తుతం భారత వాయు సేనలో శిక్షణ పొందుతున్న వీరు మరో నెల రోజుల్లో యుద్ధ విమానాలను నడపబోతున్నారు.

యుద్ధ విమానాల్లో మొదటిసారి...!
ఈ మహిళా త్రయం తేలికపాటి యుద్ధ విమానాలైన పిలాటస్‌ పీసీ-7, కిరణ్‌, హాక్‌ జెట్‌లను నడిపేందుకు శిక్షణ పొందుతున్నారు.  ప్రస్తుతం అవని, భావన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, అత్యధిక టేకాఫ్‌ వేగం కలిగిన మిగ్‌-21 యుద్ధ విమానాలను నడిపేందుకు సిద్ధమవుతున్నారు. అవని 2 సీట్ల సామర్థ్యం కలిగిన మిగ్‌-21 రకం విమానాన్నినడిపేందుకు సూరత్‌ఘర్‌ ఎయిర్‌బేస్‌లో శిక్షణ పొందుతోంది. భావన కూడా అంబాల ఎయిర్‌బేస్‌లో శిక్షణకు సిద్ధమవుతోంది. ఇక మోహన హాక్‌ జెట్‌ను నడిపేందుకు కలైకుండ ఎయిర్‌బేస్‌లో శిక్షణ పూర్తయిన తర్వాత ఆపరేషనల్‌ స్క్వాడ్‌గా వెళ్లబోతుందని సీనియర్‌ అధికారి తెలిపారు. 

కఠినమైన శిక్షణలో నెగ్గితేనే...!
జెట్‌ ఫైటర్‌గా రాణించాలంటే కఠినమైన శిక్షణ పూర్తిచేయాల్సి ఉంటుంది. సుమారు పన్నెండుసార్లు ద్వంద్వ తనిఖీలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదట విమానం ఎగరటంలో మెళకువలు, నిర్వహణ పద్ధతులు, టేకాఫ్‌, లాండింగ్‌ వంటి ప్రాథమిక అంశాలపై పూర్తి పట్టు సాధించాలి. యుద్ధ విమానం నడిపే సమయంలో ఏర్పడే చిక్కుల్ని ఎదుర్కొనే సమయస్ఫూర్తి, సామర్థ్యం, నేర్పు ఉండాలి. ప్రాథమిక శిక్షణ అనంతరం యుద్ధ సమయంలో పాటించాల్సిన వ్యూహాలతో పాటు, యుక్తులు ప్రదర్శించగలగాలి. అవసరాన్ని బట్టి ఆకాశం నుంచి ఆకాశంలోకి, ఆకాశం నుంచి భూమిపైకి విమాన మార్గాన్నిమళ్లించే చతురత కలిగి ఉండాలి. ఈ శిక్షణలో నెగ్గితేనే యుద్ధ  విమానాన్ని నడిపేందుకు అర్హత సాధిస్తారు.

ఈ దశలన్నీ దాటుకుని సుమారు ఏడాదిన్నరగా జరుగుతున్న శిక్షణ పూర్తి చేసుకుని మొదటి మహిళా పైలట్‌ ఫైటర్లుగా మారనున్న అవని, భావన, మోహనలకు ఆల్‌ ద బెస్ట్‌ చెప్పేద్దాం.

- సుష్మారెడ్డి యాళ్ళ

మరిన్ని వార్తలు