శాంసంగ్ వాషింగ్ మెషీన్లూ పేలిపోతున్నాయి

29 Sep, 2016 19:43 IST|Sakshi
వాషింగ్ మెషీన్లూ పేలిపోతున్నాయి..
శాంసంగ్ ఫోన్లే కాదు... తాజాగా వాషింగ్ మెషిన్లు కూడా పేలిపోతున్నాయి.  అమెరికా ఫెడరల్ కోర్టులో నమోదయిన కేసు ఈ విషయాన్నే ధ్రువీకరిస్తోంది. శాంసంగ్ కంపెనీకి చెందిన టాప్ లోడింగ్ వాషింగ్ మెషిన్లలో బట్టలు వేసినప్పుడు టబ్ నెమ్మదిగా తిరగుతూ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 
 
కొద్ది సంవత్సరాలుగా శాంసంగ్ వాషింగ్ మెషీన్లు ఉన్నట్టుండి పేలిపోతున్నాయని బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు టెక్సాస్ నుంచి ముగ్గురు మహిళలు, ఇండియానా, జార్జియాల నుంచి మరికొంత మంది  వాషింగ్ మిషన్ల పేలుళ్లపై రక్షణ చర్యలను చేపట్టేలా చూడాలని ఫెడరల్ కోర్టును కోరారు.
 
కేసు నమోదైన శాంసంగ్ వాషింగ్ మిషన్లలో లోపాలు ఉన్నాయని అమెరికా వస్తు వినియోదారుల రక్షణ కమిషన్ (సీపీఎస్సీ) పేర్కొంది. 2011 మార్చి నుంచి 2016 ఏప్రిల్ మధ్య కాలంలో తయారైన వాషింగ్ మిషన్లపై శాంసంగ్ కంపెనీతో చర్చిస్తున్నట్లు సీపీఎస్సీ తెలిపింది.
 
ఏ మోడల్ మెషిన్లలో లోపం ఉందో బయటపెట్టని సీపీఎస్సీ దాదాపు 11మోడళ్లు ఈ జాబితా ఉన్నట్లు చెప్పింది. కాగా, శాంసంగ్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లను ఎక్కువ లోడ్ తో వేగంగా నడపొద్దని సీపీఎస్సీ, శాంసంగ్ కంపెనీ సలహాల కమిటీలు సూచించాయి. అయితే పేలుళ్లు సంభవించినట్లు తమకు ఎలాంటి సమాచారం లేదని శాంసంగ్ పేర్కొంది. 2011 నుంచి ఇప్పటివరకూ శాంసంగ్ వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొలేదని చెప్పింది. కాగా, గత కొద్ది రోజులుగా శాంసంగ్ కు చెందిన ఫోన్లు డిజైన్ లోపంతో పేలుతున్న విషయం తెలిసిందే.
>
మరిన్ని వార్తలు