ఉరి.. ఊపిరి మధ్య..

31 Jul, 2015 02:10 IST|Sakshi
ఉరి.. ఊపిరి మధ్య..

14రోజులు గడువు కోరుతూ అర్ధరాత్రి సుప్రీం తలుపు తట్టిన మెమన్ లాయర్లు
 చట్టంలోని వెసులుబాట్లను దుర్వినియోగం చేస్తున్నారన్న ఏజే
 ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన త్రిసభ్య ధర్మాసనం
 వేకువజామున 4.50 గంటలకు పిటిషన్ కొట్టివేయడంతో వీడిన ఉత్కంఠ
 
 హైడ్రామా...
 యాకుబ్ మెమన్‌కు రాష్ట్రపతి క్షమాభిక్షను నిరాకరించారనే  వార్త విని భారతావని నిద్రలోకి జారుకుంది. ఉరిని తప్పించేందుకు జరిగిన విశ్వప్రయత్నాల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి మరో హైడ్రామా మొదలైంది. ఆఖరి ప్రయత్నంగా మెమన్ లాయర్లు రాత్రి 11.30కు భారత ప్రధాన న్యాయమూర్తి ఇంటి తలుపులు తట్టారు. దాంతో సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించే ఎపిసోడ్ మొదలైంది. ఆ క్రమమే ఇది..
 
 జూలై 29.. రాత్రి
 10.45: మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు.
 11.10: క్షమాభిక్ష పిటిషన్‌ను తోసిపుచ్చాక..ఉరితీతకు 14 రోజుల కనీస గడువు ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయని పేర్కొంటూ మెమన్ న్యాయవాదులు సుప్రీంను ఆశ్రయించారు.
 11.30: ప్రముఖ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, ఆనంద్ గ్రోవర్ తదితరులు భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్ దత్తు నివాసానికి చేరుకున్నారు.
 11.30: సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులు జస్టిస్ దత్తు నివాసానికి విచ్చేశారు.  సీజేఐ నివాసం 5, క్రిష్ణమీనన్ మార్గ్ వద్ద మీడియా, లాయర్లతో సందడి నెలకొంది.
 
 జూలై 30 .. తెల్లవారుజామున
 
 1.00: సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ దీపక్ మిశ్రా నివాసానికి మారిన సీన్.
 1.30: న్యాయవాదులు జస్టిస్ మిశ్రా
 నివాసానికి చేరుకున్నారు.
 1.35: తెల్లవారుజామున 02.10కి కోర్టుకు వచ్చేందుకు న్యాయమూర్తులు మిశ్రా, ప్రఫుల్ల చంద్ర పంత్, అమితావ రాయ్‌ల అంగీకారం.
 2.00: స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా.. నడిరాత్రి సుప్రీంకోర్టు తలుపులు తెరుచుకున్నాయి. కోర్టు హాలు-4 సిద్ధమైంది.
 2.10: నాగ్‌పూర్ సెంట్రల్ జైలు కానిస్టేబుల్ నగరంలోని ఓ హోటల్‌లో మెమన్ సోదరుడికి ఉరి సమాచారంతో లేఖను అందజేశారు.
 2.30: న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ రాక ఆలస్యం కావడంతో విచారణ జాప్యం.
 3.20: రివ్యూ పిటిషన్‌పై విచారణ ప్రారంభం. మెమన్ తరఫు లాయర్లు తమ వాదన వినిపించారు.
 3.50: అటార్నీ జనరల్ వాదన ప్రారంభం
 4.00: నాగ్‌పూర్ జైలులో మెమన్ గదికి జైలు అధికారులు వెళ్లారు. ఏ నిర్ణయం రాలేదు కాబట్టి వాళ్లు తమ ముందున్న డెత్ వారెంట్‌కు అనుగుణంగా ఏర్పాట్లు మొదలుపెట్టారు.
 4.30: ముగిసిన వాదనలు.
 4.50: ఉరిపై స్టే ఇవ్వడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుందంటూ మెమన్ పిటిషన్‌ను  తిరస్కరించిన త్రిసభ్య ధర్మాసనం.
 6.30: స్నానం, ఇతర కార్యక్రమాలయ్యాక ఉరికంబం వైపు మెమన్‌ను నడిపించారు.
 
 న్యూఢిల్లీ: అర్ధరాత్రి దాటిపోయింది.. అప్పటికే యాకూబ్ క్షమాభిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్ తోసిపుచ్చారు.. కొద్దిసేపటికే రాష్ట్రపతి కూడా క్షమాభిక్షకు నో చెప్పేశారు.. అయినా యాకూబ్ లాయర్ల విశ్వప్రయత్నం.. అర్ధరాత్రి వెళ్లి సుప్రీంకోర్టు తలుపుతట్టారు..అప్పటికప్పుడు ముగ్గురు సభ్యులతో బెంచ్.. సుప్రీం చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రాత్రి 3.20 గంటలకు అసాధారణ విచారణ..! గంటన్నర పాటు వాదోపవాదాలు..! ఉరి, ఊపిరి మధ్య నిశిరాత్రి జరిగిన న్యాయ సమరమిది!! చివరికి ఉరే సరి అని ధర్మాసనం తేల్చేసింది. దీంతో యాకూబ్ ఉరిపై గురువారం తెల్లవారుజాము వరకు సాగిన నరాలు తెగే ఉత్కంఠకు తెరపడింది.
 
 ఎవరేం వాదించారు?: క్షమాభిక్ష పిటిషన్లను గవర్నర్, రాష్ట్రపతి తిరస్కరించిన వెంటనే యాకూబ్ లాయర్లు చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు నివాసానికి వెళ్లారు. అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేశారు. జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల బెంచ్‌ను సీజేఐ ఏర్పాటు చేశారు. తర్వాత లాయర్లు జస్టిస్ దత్తు నివాసం నుంచి తుగ్లక్ రోడ్‌లోని జస్టిస్ దీపక్ మిశ్రా ఇంటికి వెళ్లారు. తర్వాత అంతా సుప్రీంకోర్టు హాలు నంబర్ 4లో సరిగ్గా రాత్రి 3.20 గంటలకు ముగ్గురు సభ్యుల బెంచ్ విచారణ చేపట్టింది. క్షమాభిక్షపిటిషన్‌ను తిరస్కరించిన తర్వాత దాన్ని సవాలు చేసుకునేందుకు యాకూబ్‌కు 14 రోజులు గడువివ్వాలని లాయర్లు వాదించారు. అలాగే క్షమాభిక్ష తిరస్కరణ, శిక్ష అమలుకు మధ్య ఏడు రోజుల అంతరం ఉండాలని మహారాష్ట్ర జైళ్ల నియమావళి చెబుతోందని యాకూబ్ లాయర్లు ఆనంద్ గ్రోవర్, యుగ్ చౌధురి పేర్కొన్నారు. యాకుబ్ పిటిషన్ న్యాయ వ్యవస్థ ఇచ్చిన కొన్ని వెసులుబాటులను దుర్వినియోగపరిచేలా ఉందని ప్రభుత్వం తరఫున అటార్నీజనరల్ ముకుల్ రోహత్గీ వాదించారు. యాకూబ్ డెత్ వారంట్‌ను త్రిసభ్య ధర్మాసనం ఇప్పటికే సమర్థించిందని, కేవలం 10 గంటల వ్యవధిలోనే దాన్ని రద్దు చేయడం కుదరదని స్పష్టంచేశారు. ఆయన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. క్షమాభిక్ష తిరస్కరణ తర్వాత దాన్ని సవా లు చేసుకునేందుకు యాకూబ్‌కు తగినన్ని అవకాశాలు లభించాయంది. శిక్ష అమలు కావాల్సిందేనని వేకువజామున 4.50 గంటలకు తీర్పు ఇచ్చింది.
 

మరిన్ని వార్తలు