-

తొలిసారి.. 9,000 తాకిన నిఫ్టీ

4 Mar, 2015 01:36 IST|Sakshi
తొలిసారి.. 9,000 తాకిన నిఫ్టీ

ముంబై: ఆర్థిక సంస్కరణలపై కొనసాగుతున్న ఆశాభావం కారణంగా మంగళవారం స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. నిఫ్టీ తొలిసారిగా 9,000 పాయింట్లను దాటింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, సన్ ఫార్మా షేర్లను విదేశీ సంస్థలు జోరుగా కొనుగోలు చేయడంతో  ట్రేడింగ్ చివరిలో జీవిత కాల గరిష్ట స్థాయి(9,008)ని తాకిన నిఫ్టీ చివరకు 40 పాయింట్ల లాభంతో 8,996 పాయింట్ల వద్ద ముగిసింది. సోమవారం నాటి ముగింపు రికార్డ్‌ను మంగళవారం నిఫ్టీ బ్రేక్ చేసింది.

నాలుగు రోజుల్లో 3.5 శాతం పెరిగిన సూచీలు....
వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్లలో లాభాల్లోనే ఉన్న స్టాక్ మార్కెట్  సూచీలు ఈ నాలుగు సెషన్లలో 3.5 శాతం వరకూ పెరిగాయి. వృద్ధి లక్ష్యంగా ఉన్న బడ్జెట్ ప్రతిపాదనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ జోరును పెంచాయని ట్రేడర్లు అంటున్నారు. జనవరిలో ఎనిమిది కీలకమైన పరిశ్రమలు మందగమన వృద్ధినే సాధించినా, ఏప్రిల్-జనవరి కాలానికి ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాలను అందుకోలేకపోయినా బడ్జెట్ ప్రతిపాదనల జోష్‌లో ఇన్వెస్టర్లు పట్టించుకోలేదని వారంటున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీమా బిల్లు, బొగ్గు గనుల బిల్లుల ఆమోదం ద్వారా  ప్రభుత్వం భారీ సంస్కరణలను కొనసాగించగలదన్న అంచనాలతో సెంటిమెంట్ బలపడుతోందని నిపుణులంటున్నారు.  ఈ కీలక బిల్లులు ఆమోదం పొందితే మార్కెట్ మరింత ముందుకు దూసుకుపోతుందని వారంటున్నారు.
 
ఒడిదుడుకులు...: మంగళవారం ట్రేడింగ్ అంతా ఒడిదుడుకులమయంగా సాగింది.  1,677 షేర్లు లాభాల్లో, 1,176 షేర్లు నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.4,224 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.21,328 కోట్లుగా, డెరివేటివ్స్ విభాగంలో రూ.1,69,412 కోట్లుగా నమోదైంది.
 
క్యాపిటల్ మార్కెట్‌లో లావాదేవీలు
 
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ, ఎంసీఎక్స్-ఎస్‌ఎక్స్ ట్రేడింగ్
 
 విభాగం        తేదీ             కొనుగోలు        అమ్మకం        నికర విలువ
 
 డీఐఐ :        03-03           1,574             1,878               - 304
                   02-03           2,359            2,178                 180
                   28-02           1,569             2,310              - 741


 ఎఫ్‌ఐఐ:        03-03         5,733        4,960           773
                     02-03         6,704        6,279           425
                     28-02         1,399            784          614
                                                                       (విలువలు రూ.కోట్లలో)
 
వెలుగులో టాటా షేర్లు
టాటా గ్రూప్ షేర్లు 20 శాతం వరకూ పెరిగాయి. టాటా ఎలెక్సీ అప్పర్ సర్క్యూట్ 20 శాతం వద్ద ముగిసింది.టాటా స్పాంజ్ ఐరన్, టాటా మెటాలిక్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా, టీఆర్‌ఎఫ్, ర్యాలీస్ ఇండియా, టాటా కాఫీ, టాటా గ్లోబల్ బేవరేజేస్, టాటా కెమికల్స్, టాటా టెలిసర్వీసెస్, టాటా పవర్  2-20 శాతం రేంజ్‌లో పెరిగాయి. 

మరిన్ని వార్తలు