రంజాన్ విషాదం: ఈద్గాలో పేలుడు.. కలకలం

7 Jul, 2016 11:26 IST|Sakshi
బంగ్లాదేశ్ లో అతిపెద్దదైన షోలాకియా ఈద్గా (ఫైల్ ఫొటో)

ఢాకా: ముస్లింలు పర్వదినాన్ని ఆనందోత్సాహల మధ్య జరుపుకొంటోన్న తరుణంలో ఉగ్రమూకల కళ్లుకుట్టాయి. ప్రార్థనలు చేస్తున్నవారే లక్ష్యంగా దాడులకు తెగబడ్డాయి. బంగ్లాదేశ్ లోనే అతి పెద్ద ఈద్గా వద్ద గురువారం ఉదయం ముష్కరులు బాంబులు పేల్చారు. ఇప్పటివరకు తెలిసిన సమాచారం మేరకు పేలుళ్లలో ఒక పోలీసు, పౌరుడు మృతి చెందారు. 12 మందికి పైగా గాయపడ్డారు. ఈద్గాకు సమీపంలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ ముష్కరులు.. లోపలినుంచి కాల్పులు జరుపుతున్నారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్రవాదులను మట్టుపెట్టే ఆపరేషన్ ను ప్రారంభించారు. కాల్పుల మోతతో ఈద్గా పరిసరాలు భీతావాహంగా మారాయి.

బంగ్లా రాజధాని ఢాకాకు 100 కిలోమీటర్ల దూరంలోని కిశోర్ గంజ్ పట్టణ శివారులో గల షోలాకియా ఈద్గా.. ఆ దేశంలోనే అతిపెద్ద ప్రార్థనా స్థలం. పర్వదినంనాడు దాదాపు 4 లక్షల మంది ముస్లింలు అక్కడ ప్రార్థనలు చేస్తారు. పెద్ద సంఖ్యలో జనం గుమ్మికూడటాన్ని అవకాశంగా తీసుకున్న ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఈద్గా ప్రవేశ ద్వారం వద్ద చోటుచేసుకున్న పేలుడులో ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ఒకరు మరణించగా, ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం ఢాకాలోని ఓ రెస్టారెంట్ లోకి చొరబడ్డ ఐసిస్ ఉగ్రవాదులు 20 మందిని పొట్టనపెట్టుకున్న సంఘటన నుంచి తేరుకోకముందే పండుగనాడు పేలుడు జరగడం బాగ్లాదేశీల్లో విషాదం నింపింది.

మరిన్ని వార్తలు