జీ20 సదస్సు ఎందుకు?

4 Sep, 2016 13:05 IST|Sakshi
జీ20 సదస్సు ఎందుకు?

హాంగ్ ఝౌ: జీ20 సదస్సు ఆదివారం చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా తమ సత్తాను ప్రపంచదేశాలకు తెలిపే మరో సువర్ణావకాశం చైనీయులకు దక్కింది. ఇందుకోసం చైనా ప్రభుత్వం నగరంలోని ఫ్యాక్టరీలన్నింటికి సెలవులు ప్రకటించింది. దీంతో మేఘాలు సహజవర్ణంలో కనిపించే అవకాశం పెరుగుతుంది. దాంతో పాటు పశ్చిమాన ఉన్న సరస్సును కూడా సుందరంగా ముస్తాబు చేసింది.

జీ20 అంటే ఏంటి?
ప్రపంచంలోని మొదటి 19 పెద్ద ఆర్ధికంగా శక్తిమంతమైన దేశాలు, యూరోపియన్ యూనియన్(ఈయూ)ల సమ్మేళనమే జీ20 సదస్సు. మొత్తం ప్రపంచ దేశాల జీడీపీలో ఈ దేశాల జీడీపీ 85శాతంగా ఉంది. కాగా ప్రతి ఏటా వార్షిక సదస్సును ఆర్ధిక పాలసీల గురించి చర్చించేందుకు నిర్వహిస్తారు. అయితే, సదస్సు నిర్వహిస్తున్న సమయంలో ప్రభావితం చేస్తున్న అంశాలను కూడా చర్చకు తీసుకురావచ్చు.

ఎలా మొదలైంది?
1999లో ఆసియా ఆర్ధికసంక్షోభం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా సహకరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తొలుత ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏడు దేశాలు కలిసి జీ20ని ఏర్పాటుచేశాయి. ఆ తర్వాత క్రమేపి సభ్యుల సంఖ్య 20కు చేరుకుంది.

ఇప్పటివరకు ఏం చేసింది?
జీ20 సదస్సు గురించి నిపుణులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. కొంతమంది ఆర్ధికపరమైన విషయాల్లో సదస్సు కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. మరికొందరు గత ఏడాది టర్కీలో జరిగిన సదస్సులో దేశాలు అంగీకరించిన వాటిని అమలు చేయలేదని అంటున్నారు. మొత్తం 113 అంశాలకు ఆమోదం వేసిన వాటిలో శిలాజ ఇంధనాల నుంచి వలసలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. అయితే, వీటన్నింటిలో కేవలం 77 శాతం అంశాలను మాత్రమే సభ్యత్వ దేశాలు నెరవేర్చాయి. దీంతో సదస్సు ప్రతిష్ట మసకబారే పరిస్థితి ఏర్పడింది.

ఈ ఏడాది ఏం జరగొచ్చు
ప్రపంచదేశాల అభివృద్ధి తక్కువగా ఉండొచ్చని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టిన్ లగార్డె వ్యాఖ్యానించడంతో ఈ ఏడాది సభ్యత్వదేశాలు కొత్తహామీలను ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.

చైనాకు ఎందుకు ముఖ్యం?
2008 సంక్షోభం తర్వాత ప్రపంచం మొత్తం చైనా సాయం కోసం తిరిగి చూసింది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్ధికవ్యవస్థగా ఉన్న చైనా మరింత ప్రాముఖ్యత కలిగిన పాత్ర పోషించడానికి ఆరాటపడుతోంది. చైనా ఇప్పటివరకూ నిర్వహించిన సదస్సుల్లో జీ20నే అతిపెద్దది. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ప్రత్యర్థులకు, ప్రపంచదేశాలకు తమ శక్తిని చూపించాలని ఉవ్విళ్లూరుతున్నారు.

>
మరిన్ని వార్తలు