అదృశ్యమైన ఆ విమానం చివరిక్షణాల్లో..!

2 Nov, 2016 16:54 IST|Sakshi
అదృశ్యమైన ఆ విమానం చివరిక్షణాల్లో..!
దాదాపు రెండేళ్ల కిందట హిందూ మహా సముద్రంలో అదృశ్యమైన మలేషియా విమానం ఎంహెచ్‌ 370 గురించి తాజాగా దర్యాప్తులో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్‌ 370 విమానం కూలిపోతున్న చివరిక్షణాల్లో దానిని ఎవరూ నియంత్రించలేదని దర్యాప్తు అధికారులు తాజాగా నిర్ధారణకు వచ్చారు.  
 
2014లో గల్లంతైన ఈ విమానానికి సంబంధించి ఇప్పటివరకు లేశమాత్రమైన అవశేషం దొరకలేదు. ఇది ఎక్కడ కూలిపోయిందనే జాడ కూడా లేదు. ఈ నేపథ్యంలో దీని ఆచూకీ గురించి వెతుకుతున్న దర్యాప్తు అధికారులు, నిపుణులు బుధవారం  ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సమావేశమయ్యారు. ఇంధనం అయిపోవడంతో ఈ విమానం (బోయింగ్‌ 777) ఒక్కసారిగా అతివేగంగా పల్టీలు కొడుతూ కూలిపోయిందని, ఈ చివరిక్షణాల్లో పైలట్లు దీనిని నియంత్రించే ప్రయత్నం చేయలేదని దర్యాప్తు అధికారులు చాలాకాలంగా చెప్తున్న సంగతి తెలిసిందే. తాజా సమావేశంలో నిపుణులు, దర్యాప్తు అధికారులు ఈ వాదనను సమర్థిస్తున్నట్టు సంకేతాలు ఇస్తూ ఒక ప్రటకన విడుదల చేశారు.  

అయితే, ఇటీవల మరికొందరు నిపుణులు మాత్రం ఈ వాదనతో విభేదిస్తున్నారు. చివరిక్షణాల్లో విమానాన్ని నియంత్రించడానికి ప్రయత్నాలు జరిగాయని, ఇవి ఫలించకపోవడంతో మరింత వేగంగా విమానం కూలిపోయి ఉంటుందని వీరు అభిప్రాయపడుతున్నారు. విమానం కూలిపోయిన ప్రదేశం జాడ తెలియకపోవడానికి కారణం.. చివరిక్షణాల్లో ఈ నియంత్రణ చర్యలే కారణం కావొచ్చునని, దీనివల్ల సముద్రం లోతులోకి విమానం కూరుకుపోయి ఉంటుందని వారు అంటున్నారు. అయితే, దర్యాప్తు అధికారులు, నిపుణులు మాత్రం విమానం చివరిక్షణాల్లో చాలావేగంగా కూలి పడిపోయిందని, దీనిని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు జరిగినట్టు కనిపించడం లేదని శాటిలైట్‌ సమాచారం ఆధారంగా విశ్లేషించామని పేర్కొన్నారు. 2014 మార్చి 8న 239 మందితో బీజింగ్‌ నుంచి కౌలాలంపూర్‌  బయలుదేరిన ఎంహెచ్‌ 370 విమానం అకస్మాత్తుగా అదృశ్యమై.. ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయిన సంగతి తెలిసిందే. 
 
మరిన్ని వార్తలు