‘ఆహార భద్రత’కు ఆమోదం

27 Aug, 2013 02:46 IST|Sakshi
‘ఆహార భద్రత’కు ఆమోదం
 • లోక్‌సభలో సుదీర్ఘచర్చ..మూజువాణి ఓటుతో నెగ్గిన బిల్లు
 •      కోట్లాది మంది ఆకలికి శాశ్వత పరిష్కారం: సోనియా
 •      బిల్లుపై ఓటింగ్‌లో పాల్గొనలేకపోయిన కాంగ్రెస్ అధినేత్రి
 •      అనారోగ్యంతో వెళ్లిపోయిన సోనియా.. ఎయిమ్స్‌లో చేరిక
 • దేశంలో మూడింట రెండు వంతుల మంది పేదలకు ఆహార హక్కు కల్పిస్తూ కేంద్రం రూపొందించిన ఆహార భద్రత బిల్లు ఎట్టకేలకు లోక్‌సభ ఆమోదం పొందింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేశంలో ఆకలి, పోషకాహార లోపాలను నిర్మూలించటమే బిల్లు లక్ష్యమని ఆమె ప్రకటించారు. దీన్ని ఓటు భద్రత బిల్లుగా బీజేపీ అభివర్ణించింది.   చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది.

   ఆహార భద్రత బిల్లు ముఖ్యాంశాలు

  •  ప్రభుత్వానికి అయ్యే వ్యయం - 1,30,000 కోట్లు
  •  పథకంతో లబ్ధి పొందేవారి సంఖ్య- 82కోట్లు
  •  దేశ జనాభాలో లబ్ధిదారుల శాతం-66%
  •  అంత్యోదయ అన్న యోజన పథకం కింద ప్రస్తుతం 2.43 కోట్ల అత్యంత నిరుపేద కుటుంబాలకు నెలకు ఇస్తున్న 35 కేజీల ధాన్యాన్ని ఇకముందూ ఇస్తారు.
  •  గర్భిణులకు, బాలింతలకు బిడ్డ పుట్టాక ఆరు నెలల వరకు అంగన్‌వాడీ ద్వారా ఉచిత ఆహారం.  
  •  సాధారణ గ్రూపు కుటుంబాల్లోని ఒక్కో వ్యక్తికి నెలకు 3 కిలోల ధాన్యాలు ఇస్తారు. వీటి ధర ఆయా ధాన్యాల కనీస మద్దతు ధరలో 50 శాతానికి మించకుండా ఉంటుంది.
  •  ప్రాధాన్యతా గ్రూపు కుటుంబాల్లోని వ్యక్తులకు నెలకు 5 కిలోల చొప్పున ధాన్యాన్ని ఇస్తారు. వీటిలో బియ్యం (కిలో రూ.3), గోధుమలు (కిలో రూ.2), జొన్నలు ఇతర తృణధాన్యాలు (కిలో రూ.1) ఉంటాయి.

  న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ, యూపీఏ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆహార భద్రత బిల్లు ఎట్టకేలకు లోక్‌సభ ఆమోదం పొందింది. ఎన్నికలకు ముందు ఈ బిల్లుకు ఎట్టిపరిస్థితుల్లో ఆమోదం పొందాలన్న కాంగ్రెస్ ప్రయత్నం ఫలిస్తుందా లేదా అన్న సందేహాలు, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో అసలు బిల్లు ప్రవేశపెట్టటం సాధ్యమవుతుందా అన్న సంశయాలకు తెరదించుతూ.. సోమవారం లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టటం, వాడివేడిగా చర్చ జరగటం, అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదించటం వరుసవెంట జరిగిపోయాయి. అయితే.. 15వ లోక్‌సభలో తొలిసారి గళం విప్పి ఆహార భద్రత బిల్లుపై ప్రసంగించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆ తర్వాత అస్వస్థతకు గురవటంతో ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారు.
   
   ఆమె అనారోగ్యానికి గురవటంతో అర్ధంతరంగా సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం సోనియా చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేరారు. సోనియా కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా.. తన తల్లితో పాటు ఆస్పత్రికి వెళ్లటంతో ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారు. అంతకుముందు.. ఆహార మంత్రి కె.వి.థామస్ ఆహార భద్రత బిల్లును లోక్‌సభలో చర్చకు ప్రవేశపెట్టారు. బిల్లు లక్ష్యాలు, ఇతర అంశాలను స్థూలంగా వివరించారు. ఆహార భద్రత బిల్లు అమలులోకి వచ్చినప్పటికీ.. రాష్ట్రాలకు ఆహార ధాన్యాల సరఫరాను తగ్గించబోమని స్పష్టంచేశారు. బిల్లుపై చర్చ జరిగేటపుడు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ కూడా సభలో ఉన్నారు. ఈ బిల్లు వెనుక కీలక పాత్రధారి అయిన సోనియాగాంధీ కాంగ్రెస్ తరఫున మాట్లాడుతూ.. ‘‘భవిష్యత్తులో దేశం నుంచి ఆకలి, పోషకాహారలేమిని నిర్మూలించటం మా లక్ష్యం’’ అని ప్రకటించారు. ‘‘పేద ప్రజల కష్టాలకు ముగింపు పలికే చరిత్రాత్మక చర్య చేపట్టే అవకాశం ఈ సభకు ఈ రోజు వచ్చింద’’ని.. రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనపెట్టి ఆహార భద్రత బిల్లుకు మద్దతివ్వాలని తన ప్రసంగంలో కోరారు. ‘‘ఇది ఆహార భద్రత బిల్లు కాదు.. ఓటు భద్రత బిల్లు’’ అని ప్రతిపక్ష బీజేపీ విమర్శించింది. ఈ బిల్లు లోపభూయిష్టంగా, బలహీనంగా ఉన్నప్పటికీ.. తాము దానికి మద్దతిస్తున్నామని ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చి, ఈ చట్టాన్ని మరింత మెరుగుపరచటం కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ బిల్లును తెచ్చారని.. యూపీఏ సర్కారుకు వెలుపలి నుంచి మద్దతిస్తున్న సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్‌యాదవ్ విమర్శించారు. ఈ బిల్లు రాష్ట్రాలపై భారం మోపుతుందని.. దీనిపై ముఖ్యమంత్రులతో చర్చించాలని, అప్పటివరకూ బిల్లును పక్కనపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
   
   సుదీర్ఘంగా సాగిన చర్చకు ఆహార మంత్రి కె.వి.థామస్ బదులిస్తూ రాష్ట్రాలను సంప్రదించలేదన్న ఆరోపణలను కొట్టివేశారు. తాము నాలుగు సార్లు రాష్ట్రాలతో చర్చలు జరిపామని చెప్పారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేసినప్పుడే ఈ చట్టం విజయవంతమవుతుందని పేర్కొన్నారు. అనంతరం.. ఆహార భద్రతపై జూలై 5న జారీచేసిన ఆర్డినెన్స్‌ను తిరస్కరిస్తూ తీర్మానం, బిల్లు ఆమోదంపై సంయుక్తంగా ఓటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార బిల్లుకు ప్రతిపక్షం సూచించిన దాదాపు 300కు పైగా సవరణలను సభ తిరస్కరించింది. అందులో.. బాలింతలకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఆహార ధాన్యాలు అందించాలంటూ ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ చేసి ప్రతిపాదన కూడా ఉంది. ఈ బిల్లుకు ప్రభుత్వం నాలుగు సవరణలు ప్రతిపాదించగా అవి ఆమోదం పొందాయి. బిల్లు అమలుకు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపటమనేది ఈ సవరణల్లో ఒకటి. మొత్తంగా మూజువాణి ఓటుతో బిల్లును లోక్‌సభ ఆమోదించింది.
   
   కోట్లాది మంది ఆకలి సమస్యకు శాశ్వత పరిష్కారం: సోనియా
   ‘‘ఆకలి, పోషకాహార లోపాలను నిర్మూలించటమే కాంగ్రెస్ లక్ష్యం. దేశంలో కోట్లాది మంది ఆకలి సమస్యకు శాశ్వతంగా ముగింపు పలుకుతూ ఆహార భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ఆహార భద్రత బిల్లు ఒక చరిత్రాత్మక అవకాశం. భారతీయులందరికీ ఆహార భద్రతను కల్పించే బాధ్యతను దేశం తీసుకుంటుందని పెద్ద సందేశం పంపాల్సిన సమయమిది. అన్ని రాజకీయ పార్టీలూ విభేదాలను పక్కనపెట్టి ఆహార భద్రత బిల్లుకు మద్దతివ్వాలి. దీనిని అమలు చేయటానికి మనకు తగినన్ని వనరులున్నాయా? ఇది రైతులకు ప్రయోజనం కలిగిస్తుందా? అన్నవి సమస్యలు కాదు. దీనికి మనం వనరులు సమకూర్చాల్సి ఉంటుంది. మనం అమలు చేయాల్సి ఉంటుంది. ఈ చట్టాన్ని అమలు చేయటానికి ప్రజా పంపిణీ వ్యవస్థను సంస్కరించటం తప్పనిసరి. ఆహార బిల్లు ప్రయోజనాలు లబ్ధిదారులకు చేరేలా చూడాలంటే లీకేజీలను తొలగించాల్సి ఉంటుంది. యూపీఏ ప్రభుత్వ చర్చలతో దేశంలో సాధికార విప్లవం వచ్చింది. ఇది మాకు గర్వకారణం. ఆహార భద్రత కల్పిస్తామని 2009 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. యూపీఏ ప్రభుత్వం 2005లో సమాచార హక్కును తీసుకొచ్చింది. ఇది ప్రజా జీవితంలో అనూహ్య పారదర్శకతను పెంపొందించింది. కొన్నిసార్లు మాకు కూడా ఇది ప్రతికూలంగా మారింది. అదే ఏడాది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హక్కును తీసుకువచ్చింది.
   
   దీనిద్వారా ప్రతి నాలుగు గ్రామీణ గృహాల్లో ఒక గృహానికి ఉపాధిని అందించింది. ఫలితంగా గ్రామీణ వేతనాలు పెరిగాయి. 2006లో విప్లవాత్మక ఆహార హక్కుల చట్టం తెచ్చాం. సంప్రదాయంగా జీవనం కోసం అడవులు, అటవీ ఉత్పత్తులపై ఆధారపడిన లక్షలాది గిరిజన, ఇతర కుటుంబాలకు లబ్ధి చేకూర్చింది. 2008లో విద్యా హక్కు అమలులోకి తెచ్చాం. దీని ఫలితంగా పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇప్పుడు ఆహార భద్రత హక్కును తెస్తున్నాం. ఈ చట్టం కేవలం ఒక ఆరంభమే. ముందుకు వెళ్లే కొద్దీ నిర్మాణాత్మక సూచనలను తీసుకోవటానికి మేం సిద్ధంగా ఉన్నాం. అనుభవం నుంచి మేం నేర్చుకుంటాం.
   
   ఇది ఓటు భద్రత బిల్లు
   ‘‘ఇది ఓటు భద్రత బిల్లు.. ఆహార భద్రత బిల్లు కాదు. నేను ఆహార భద్రత బిల్లుకు అనుకూలమే. కానీ ప్రభుత్వం తెచ్చిన బిల్లులో చాలా లోపాలున్నాయి. వాటిని సవరించాలి. 2009లో భారత రాష్ట్రపతి తన ప్రసంగంలో ఆహార భద్రత బిల్లు గురించి మాట్లాడారు. కానీ.. మీరు బయటకు వెళ్లేటపుడు ఈ బిల్లును తీసుకువస్తున్నారు. అసలు తగినంత ఆహారం అంటే అర్థమేమిటి? కొనుగోలు శక్తి ఆధారంగా ఉంటుం దా? కేలరీల విలువ ఆధారంగా ఉంటుందా? లేక పోషకాల ఆధారంగా ఉంటుం దా? అర్హమైన గృహాలు అని మీరు అన్నారు... ఎందుకీ తమాషా? కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ఉంటే ఏంచేస్తారు? ఒక వ్యక్తిని గృహంగా వర్గీకరిస్తారా అనేది మీరు స్పష్టంచేయాలి. ఈ బిల్లు అమలుకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? సార్వజనీన ఆహార భద్రత కల్పించటం బిల్లు లక్ష్యంగా ఉండాలి.’’
   - మురళీమనోహర్‌జోషి (బీజేపీ)
   
   పార్లమెంట్ సమావేశాలు 6 వరకు పొడిగింపు
   పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ 6వ తేదీ వరకు పొడిగించారు. సీమాంధ్ర ఎంపీల ఆందోళనలు, వాయిదాల నేపథ్యంలో లోక్‌సభ సరిగా సాగకపోవడంతో పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులను ఆమోదించడం కోసం సమావేశాలను మరో ఐదు రోజులపాటు పొడిగించాలని పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ సోమవారం నిర్ణయం తీసుకుంది.
   
   యూపీఏ సమీకృత అభివృద్ధికి ఉదాహరణ: ప్రధాని
   ఆహార భద్రత బిల్లు యూపీ ప్రభుత్వ ప్రజానుకూల సమీకృత అభివృద్ధికి మరో ఉదాహరణ అని ప్రధాని మన్మోహన్‌సింగ్ పేర్కొన్నారు. బిల్లు ఆమోదం తర్వాత పార్లమెంటు వద్ద విలేకర్లతో ఈ మాట అన్నారు.
   
   దేశంలో 82 కోట్ల మందికి ఆహార భద్రత
   ఆహార భద్రత బిల్లు రాజ్యసభ ఆమోదం కూడా పొందిన తర్వాత చట్టంగా మారుతుంది. దేశ ప్రజల్లో అత్యధికులకు ఆహార భద్రత కల్పిస్తున్న దేశాల జాబితాలో భారత్ కూడా చేరుతుంది. దేశంలోని మూడింట రెండు వంతుల ప్రజలకు.. అంటే దాదాపు 82 కోట్ల మందికి ఒక్కొక్కరికి ప్రతి నెలా ఐదు కిలోల చొప్పున ఆహార ధాన్యాలు.. బియ్యం, గోధుమలు, ఇతర ధాన్యాలను కిలో ఒక రూపాయి నుంచి 3 రూపాయల ధరకే అందించటం ఈ చట్టం లక్ష్యం. దీనిని అమలు చేయటానికి 6.2 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు అవసరమవుతాయని.. అందుకు రూ. 1.30 లక్షల కోట్ల రూపాయలు వ్యయమవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.

మరిన్ని వార్తలు