రైతన్నల రణ గర్జన

13 Sep, 2015 01:24 IST|Sakshi
రైతన్నల రణ గర్జన

ఆంధ్రప్రదేశ్‌లో రైతన్న పిడికిలి బిగించాడు. భూమి కోసం రణ గర్జన చేస్తున్నాడు. బలవంతపు భూ సేకరణకు తలొగ్గేది లేదని ఉద్యమబాట పడుతున్నాడు. బందరు పోర్టు భూ సేకరణ సంగతులు మాట్లాడతామంటూ వచ్చిన రాష్ట్రమంత్రి కొల్లు రవీంద్ర, లోక్‌సభ సభ్యుడు కొనకళ్ల నారాయణలను కోన గ్రామ ప్రజలు తరిమి ఊరుదాటించారు. శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు కోసం జారీ అయిన భూ సేకరణ నోటిఫికేషన్ లో పేర్కొన్న 8 గ్రామ పంచాయతీల రైతులు సమావేశం అయ్యారు. ‘ఈ నేల, ఈ గాలి, ఈ ఊరు మాదే, లాక్కోవాలని ముందుకు వస్తే... ఖబడ్దార్, కదనానికి సిద్ధం’ అంటూ తీర్మానించారు. విజయనగరం జిల్లాలో భోగాపురం విమానాశ్రయానికి భూమిని కోల్పోవాల్సి వస్తుందేమో అన్న బాధ.. గుండెల్ని మెలిపెట్టి వెంపడా సూరి అనే రైతు ప్రాణాలు బలితీసుకుంది.
 
ఆగిన మరో గుండె
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
భోగాపురం విమానాశ్రయం కింద తన భూములను కోల్పోవాల్సి వస్తోందనే ఆందోళనతో విజయనగరం జిల్లా భోగాపురం మండలం గూడెపువలస పంచాయతీ వెంపడాపేటకు చెందిన వెంపడా సూరి(53) గుండె ఆగిపోయింది. అధికారులు భూసేకరణకు నోటీసులిచ్చేందుకు సిద్ధపడుతున్నారని సూరి  కలత చెందాడు. శనివారం తెల్లవారుజామున ఇంటి వాకిట్లోనే కుప్పకూలిపోయాడు.  గతంలో ఇదే మండలంలోని రామచంద్రపేటకు చెందిన వడ్రంగి ముక్కాల త్రినాథ్(43) హఠాన్మరణం చెందాడు.

మరిన్ని వార్తలు