రేప్ కేసులో మాజీ ఎమ్మెల్యేకు పదేళ్ల జైలు

5 Jun, 2015 19:30 IST|Sakshi
రేప్ కేసులో మాజీ ఎమ్మెల్యేకు పదేళ్ల జైలు

అత్యాచారం కేసులో బీఎస్పీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పురుషోత్తం నరేష్ ద్వివేదీకి సీబీఐ ప్రత్యేక కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. దాంతోపాటు ఆయనకు లక్ష రూపాయల జరిమానా విధించింది. అందులో సగం బాధితురాలికి పరిహారంగా చెల్లిస్తారు. ద్వివేదీతో పాటు మరో ఇద్దరు సహ నిందితులు రాం నరేష్, వీరేంద్రకుమార్ శుక్లాలకు రెండేళ్ల చొప్పున జైలుశిక్ష, రూ. 2వేల వంతున జరిమానా విధించారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న రాజేంద్రశుక్లా, సురేష్ నేతలను నిర్దోషులుగా విడిచిపెట్టారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక జడ్జి వీకే శ్రీవాస్తవ తీర్పు ఇచ్చారు.

2010లో అప్పటికి 17 ఏళ్ల వయసున్న బాధితురాలు.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పనిచేసేది. డిసెంబర్ పదో తేదీన ఆమెను చోరీ కేసులో ఇరికించి, పారిపోతోందని చెప్పి.. ఆమెపై అత్యాచారం చేశారు. ఈ విషయం మీడియాలో రావడంతో నాటి సీఎం మాయావతి సీబీసీఐడీ విచారణ జరిపించి, ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారు. తర్వాత ఈ కేసు సుప్రీంకోర్టు సూచన మేరకు సీబీఐ చేతికి వెళ్లింది. తాజాగా ఆ మాజీ ఎమ్మెల్యేకు పదేళ్ల జైలుశిక్ష పడింది.

మరిన్ని వార్తలు