ఏడాది చివరికి ‘కమిటీ’ సిఫార్సులు

25 Aug, 2017 01:57 IST|Sakshi

న్యూఢిల్లీ: డిజిటల్‌ యుగంలో సమాచార పరిరక్షణ కోసం అవసరమైన చర్యలను సూచించేందుకు ఏర్పాటైన కమిటీ ఈ ఏడాది చివరికల్లా తన సిఫార్సులను సమర్పించే అవకాశం ఉంది. వ్యక్తిగత సమచారాన్ని భద్రపరచడం, డేటా ఉల్లంఘనలను నిలువరించడం కోసం ఎలాంటి యంత్రాంగం ఏర్పాటు చేయాలనే దానిపై సలహాల కోసం ప్రభుత్వం గతంలో 10 మంది సభ్యులతో ఓ కమిటీని నియమించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీఎన్‌ శ్రీకృష్ణ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండగా, టెలికం విభాగ కార్యదర్శి అరుణ సుందరరాజన్, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సీఈవో అజయ్‌ భూషణ్‌ పాండే, జాతీయ సైబర్‌ భద్రత సమన్వయ కర్త గుల్షన్‌ రాయ్‌ తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది చివరికి కమిటీ సిఫార్సులు సమర్పించొచ్చని న్యాయ, సమాచార సాంకేతిక శాఖల మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ గురువారం చెప్పారు. డేటా పరిరక్షణకు కొత్త చట్టం తీసుకురావాలా? లేక ప్రస్తుత ఐటీ చట్టంలో కొత్త నిబంధనలు చేర్చాలా? అనే దానిపై కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఓ అధికారి చెప్పారు.

>
మరిన్ని వార్తలు