22 ఏళ్లనాటి హత్య కేసు.. జైలుకు మాజీ ఎంపీ

18 May, 2017 15:15 IST|Sakshi
22 ఏళ్లనాటి హత్య కేసు.. జైలుకు మాజీ ఎంపీ

ఎప్పుడో 22 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్ సన్నిహితుడు, ఆర్జేడీ మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్‌ను దోషిగా జార్ఖండ్‌లోని హజారీబాగ్ కోర్టు తేల్చింది. ఆయనతో పాటు మరో ఇద్దరిని జైలుకు పంపింది. ఆయనకు ఏ శిక్ష విధించేదీ ఈనెల 23వ తేదీన నిర్ణయిస్తామని కోర్టు తెలిపింది. మాజీ ఎమ్మెల్యే అలోక్‌ సింగ్ 1995 జూలై నెలలో హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రభునాథ్ సింగ్, ఆయన సోదరుడు దీనానాథ్, మాజీ ముఖియా రితేష్ సింగ్‌లను దోషులుగా కోర్టు తేల్చింది.

అలోక్‌సింగ్ పట్నాలోని తన ఇంట్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను కాల్చి చంపారు. లాలుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించే ప్రభునాథ్ సింగ్ ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు. ఆయన మహరాజ్‌గంజ్ మాజీ ఎంపీ. అప్పట్లో జనతాదళ్ పార్టీలో ఉండే అలోక్ సింగ్‌ మీద 1991 డిసెంబర్ 28వ తేదీన కూడా ఒకసారి దాడి జరిగింది. ఆయన మస్రఖ్ జిల్లా కౌన్సిల్ కాంప్లెక్సుకు వెళ్లినప్పుడు కొంతమంది వ్యక్తులు ఆయనపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అయితే అదృష్టవశాత్తు అప్పుడు తప్పించుకున్నా, నాలుగేళ్ల తర్వాత జరిగిన దాడిలో మాత్రం ఆయన బలైపోయారు.

మరిన్ని వార్తలు