మాజీ ఎంపీయే ఆత్మాహుతి బాంబర్!

27 Jul, 2016 16:51 IST|Sakshi
మాజీ ఎంపీయే ఆత్మాహుతి బాంబర్!

ఆయనో మాజీ ఎంపీ.. అలాంటి ఉన్నత పదవి వెలగబెట్టి కూడా చివరకు ఆత్మాహుతి బాంబర్గా మారారు, 13 నిండు ప్రాణాలను బలిగొన్నారు. ఈ దారుణం ఆఫ్రికా దేశమైన సోమాలియాలో జరిగింది. సోమాలియా రాజధాని మొగదిషు విమానాశ్రయంలో జంట ఆత్మాహుతి దాడులు జరిగి 13 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ దాడులు చేసిన ఆత్మాహుతి బాంబర్లలో ఒక మాజీ ఎంపీ కూడా ఉన్నట్లు తేలింది. 2004 నుంచి 2010 వరకు సోమాలియా పార్లమెంటులో సభ్యుడిగా పనిచేసిన సలా బాడ్బాడో (53) ఆ తర్వాత వెంటనే అల్ షబాబ్ అనే ఉగ్రవాద సంస్థలో చేరారు. సోమాలియాలోని అల్ కాయిదా అనుంధ సంస్థలో చేరేందుకు తాను రాజకీయాలకు గుడ్బై చెబుతున్నట్లు ఆయన అప్పట్లో ఆయన ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పారు.


మంగళవారం నాటి ఇద్దరు బాంబర్లలో ఆయనొకరని అల్ షబాబ్ ఉగ్రవాదులు ప్రకటించారు. తమ ఇద్దరు యోధుల్లో సలా బడ్బాడో ఒకరని, హలేన్ మిలటరీ బేస్ మీద జరిగిన దాడుల్లో ఆయన కూడా పాల్గొన్నారని టెలిగ్రామ్ యాప్ ద్వారాను, అండాలస్ రేడియో స్టేషన్ ద్వారాన విడుదల చేసిన ప్రకటనల్లో చెప్పారు. అల్లా కోసం తాము కొద్ది సేపట్లో ఆత్మాహుతి దాడి చేస్తున్నామంటూ పది నిమిషాల ముందే ప్రకటించారు. కార్లలో బాంబులు పెట్టుకుని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఈ ఉగ్రవాదులు.. విమానాశ్రయం ప్రధాన బేస్కు 200 మీటర్ల దూరంలో వాటిని పేల్చేశారు. దాంతో ప్రధానంగా చాలామంది సెక్యూరిటీ సిబ్బంది మరణించారు. ఉగ్రవాద దాడిని ఆఫ్రికన్ యూనియన్, ఐక్యరాజ్యసమితి ఖండించాయి.

>
మరిన్ని వార్తలు