మాజీ మంత్రి శివశంకర్‌ కన్నుమూత

28 Feb, 2017 04:24 IST|Sakshi
మాజీ మంత్రి శివశంకర్‌ కన్నుమూత

- న్యాయమూర్తి నుంచి కేంద్ర న్యాయశాఖ మంత్రి దాకా ఎదిగిన నేత
- ఇందిర హయాంలో కీలక పదవులు
- కేరళ, సిక్కిం రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలు
- బీసీ రిజర్వేషన్ల కోసం అలుపెరగని పోరాటం
- సీఎం కేసీఆర్, జగన్, సోనియా సహా పలువురి సంతాపం
- నేడు అంత్యక్రియలు


సాక్షి, హైదరాబాద్‌:
కేంద్ర మాజీమంత్రి పుంజల శివశంకర్‌(87) కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య లక్ష్మిబాయి, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు పురానాపూల్‌ హిందూశ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం మామిడిపల్లిలో 1929 ఆగస్టు 10న జన్మించిన శివశంకర్‌ అనేక ఉన్నత పదవులను నిర్వహించారు. ఇందిరాగాంధీ హయాంలో కీలకమైన మంత్రి పదవులు చేపట్టారు. హైకోర్టు న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయవాదిగా, మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. దాదాపు దశాబ్దకాలంపాటు వివిధ శాఖలకు కేంద్రమంత్రిగా పనిచేశారు. కేరళ, సిక్కిం రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించారు.

ఇందిర ఆహ్వానంతో రాజకీయాల్లోకి..
శివశంకర్‌ ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్‌లో, కాలేజీ చదువు అమృత్‌సర్‌లో సాగింది. అమృతసర్‌లో బీఏ ఆనర్స్‌ చదివిన ఆయన 1952లో ఎల్‌ఎల్‌బీ పాసయ్యారు. హైదరా బాద్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించి, సిటీ సివిల్‌ కోర్టు బార్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌ ఉపాధ్యక్షుడిగా, 1974లో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. 1977లో ఇందిరాగాంధీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆమెకు ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరించారు. తర్వాత ఇందిర ఆహ్వానంతో 1979లో క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ ఉప ఎన్నికల్లో అఖండ విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

1980లో న్యాయశాఖ, 1982లో కేంద్ర ఇంధన శాఖ మంత్రిగా పనిచే శారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు పెంచేందుకు విశే షంగా కృషి చేశారు. 1985లో గుజరాత్‌ నుంచి రాజ్య సభకు వెళ్లి వాణిజ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1986లో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. 1994 సెప్టెంబ ర్‌లో సిక్కిం గవర్నర్‌గా, 1995లో కేరళ గవర్నర్‌గా బాధ్యత లు చేపట్టారు. 1998లో తెనాలి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూ టీ చైర్మన్‌గా కూడా శివశంకర్‌ పని చేశారు. ఇందిర, రాజీవ్‌గాంధీ ప్రభుత్వ హయాంల లో కేంద్రమంత్రిగానే కాకుండా కీలకమైన నేతగా శివశంకర్‌ చక్రం తిప్పారు. మల క్‌పేట మాజీ ఎమ్మెల్యే సుధీర్‌కు మార్‌ శివశంకర్‌ కుమారు డే. ఎందరో నాయకులకు శివశంకర్‌ రాజకీయ గురువుగా నిలిచారు. వారిలో అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలుగా రాణించారు.

బీసీ వర్గీకరణలో కీలక పాత్ర
సుప్రీంకోర్టులో శివశంకర్‌ పోరాటం తో బీసీ రిజర్వేషన్లలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ విధానం ఏర్పడింది. 1972లో వెనుకబడిన తరగతులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఆ తర్వాత అనంతరామన్‌ కమిషన్‌ ప్రభుత్వానికి సూచనలు చేస్తూ బీసీ కులాలకు 30% రిజర్వేషన్లు ప్రతిపాదించింది. దీనిపై ఏపీ హైకోర్టులో 110 రిట్‌ పిటిషన్లు దాఖలయ్యా యి, అప్పుడు బీసీలకు 30% రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు తీర్పునివ్వగా... అప్పటి జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తరపున శివశంకర్‌ సొంత ఖర్చుతో 18 మాసాలు ఢిల్లీలో మకాం వేసి, సుప్రీం కోర్టులో బీసీ రిజర్వేషన్లను గెలిపించుకొని వచ్చారు.

గవర్నర్, సీఎం, సోనియా, జగన్‌ సంతాపం
శివశంకర్‌ మృతిపట్ల గవర్నర్‌ నరసింహన్, ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, పలువురు నాయకులు సంతాపం ప్రకటించా రు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర మంత్రిగా, న్యాయమూర్తిగా, గవర్నర్‌గా, బీసీ నాయకుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. సీఎం కేసీఆర్‌ శివశంకర్‌ భౌతిక కాయానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. మంత్రులు మహమూద్‌ అలీ, నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీఎల్పీ నేత జానారెడ్డి, కేవీపీ రాంచంద్రారావు, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ, దానం నాగేందర్, మండలి బుద్ధప్రసాద్‌ తదితరులు నివాళులర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ సీఎం కె.రోశయ్య, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు శివశంకర్‌ మృతికి సంతాపం ప్రకటించారు.

మరిన్ని వార్తలు