సమగ్ర విచారణ

27 Jan, 2016 03:58 IST|Sakshi
సమగ్ర విచారణ

* సీఎం ఆదేశంతో ఉరకలు
* రంగంలోకి రెండు బృందాలు
* న్యాయ విచారణకు పార్టీల ఒత్తిడి
* నేడు కోర్టులో విచారణ
* విద్యార్థినుల లేఖలో మనోవేదన

సాక్షి, చెన్నై: విల్లుపురం సమీపంలోని ఎస్‌బీఎస్ సిద్ధ వైద్య కళాశాల విద్యార్థినుల మృతి మిస్టరీ తేల్చేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సమగ్ర విచారణకు సీఎం జయలలిత ఆదేశించడంతో పోలీసు యంత్రాంగం ఉరుకలు పరుగులతో దర్యాప్తును వేగవంతం చేసింది.

మరణించిన విద్యార్థులు రాసినట్టుగా పేర్కొనబడుతున్న లేఖలో వారు ఎదుర్కొన్న తీవ్ర ఆవేదన గురించి వివరించబడి ఉండడంతో అక్కడి విద్యార్థులు ఏ మేరకు కష్టాలు పడుతున్నారో స్పష్టం అవుతోంది.విల్లుపురం సమీపంలోని కళ్లకురిచ్చి వద్ద ఉన్న ఎస్‌వీఎస్ వైద్య కళాశాలకు చెందిన మోనీషా, ప్రియాంక, శరణ్య అనుమానాస్పద స్థితి లో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై న్యాయ విచారణకు ప్రతి పక్షా లు, ప్రజా సంఘాలు, విద్యార్థి లోకం డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. శరణ్య, ప్రియాంక కుటుంబాలు అధికారుల బుజ్జగింపులకు తలొగ్గాయి. ఆ ఇద్దరు మృత దేహాల్ని తీసుకుని అంత్యక్రియలు సైతం పూర్తి చేశారు. అయితే, మోనీషా మృత దేహం మాత్రం ఇంకా మార్చురీలోనే ఉంది.

ఇందుకు కారణం ఆమె తండ్రి తమిళరసన్ కోర్టును ఆశ్రయించి ఉండడమే. బుధవారం ఈ కేసు విచారణ హైకోర్టులో జరగనుంది. ఈ వ్యవహారంపై కోర్టు ఏ విధంగా స్పందించనున్నదో అన్న ఉత్కంఠ బయలు దేరి ఉంది. ఈ సమయంలో సీఎం జయలలిత ఈ కేసుపై తీవ్రంగా స్పం దించి ఉన్నారు. సమగ్ర విచారణను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించడంతో పాటుగా, మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు తలా రూ.లక్ష చొప్పున ప్రకటించా రు. సీఎం జయలలిత సమగ్ర విచారణకు ఆదేశించడంతో ఆ జిల్లా ఎస్‌పీ దేవేంద్రనాయర్ అధికారులతో సమాలోచించారు. రెండు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు.

డిప్యూటీ సూపరింటెండెంట్ మదివానన్ నేతృత్వంలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, నలుగురు సబ్ ఇన్‌స్పెక్టర్లు, 12 మంది పోలీసులతో ఓ బృందం, ఇన్‌స్పెక్టర్ కుమార్ నేతృత్వంలో మరో బృందం రంగంలోకి దిగింది. ఈ రెండు బృందాల్లో 28 మంది సిబ్బం దిని నియమించారు. ఈ బృందాలు ఆగమేఘాలపై మంగళవారం పలు కోణాల్లో దర్యాప్తు సాగించాయి. బుధవారం కోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉండడంతో అందుకు తగ్గ కసరత్తుల్ని సైతం వేగవంతం చేసి ఉన్నారు. ఆ విద్యార్థినులు రాసినట్టుగా పేర్కొన బడుతున్న లేఖను మీడియాకు విడుదల చేశారు. అందులో ఆ విద్యార్థినులు నానా ఇబ్బందులకు  గురి కాబడ్డట్టు పేర్కొన బడి ఉన్నది.

అక్కడ చదువుకుంటున్న విద్యార్థినుల ద్వారా మరుగు దొడ్లు కడిగించడం, కళాశాల పరి సరాల్ని శుభ్రం చేయించడం, వంట చేయించడం వంటి చర్యలతో పాటుగా తాము ఎదుర్కొన్న చీవాట్లను అందులో వివరించి ఉన్నారు. అలాగే లక్షలాది రూపాయల్ని దండుకోవడమే కాకుండా మేనేజర్ వెంకటేష్ విద్యార్థినులతో అసభ్యకరంగా వ్యవహరించడం, కరస్పాండెంట్ వాసుకీ నోటికి వచ్చినట్టు అసభ్య పదజాలాలతో దూషించడం వంటి వ్యవహారాలను ఆలేఖలో వివరించ బడి ఉండడం బట్టి చూస్తే, విద్య పేరుతో విద్యార్థినులు అక్కడ ఎన్నికష్టాలు పడుతున్నారో స్పష్టమవుతోంది. తమ మరణం తర్వాతైనా ఈ కళాశాలపై చర్యలు తీసుకోండని, ఇన్నాళ్లు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకున్న వాళ్లు లేరని, ఇక తప్పకుండా తమ కళాశాల వైపు అందరూ పరుగులు తీస్తారని, వీరందరూ శిక్షించబడాలని ఆ లేఖను ముగించి ఉంది.

అందులోని కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి ఉన్నారు. మేనేజర్ వెంకటేష్ ఓ సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా చలామణి కావడమే కాకుండా, విద్యార్థినులను లైంగిక వేధింపులకు సైతం గురి చేసినట్టుగా వచ్చిన సంకేతాలతో అతడి కోసం వేట తీవ్రతరమైంది. అయితే పోలీసుల విచారణతో ఒరిగేది శూన్యమేనని, న్యాయ విచారణకు ఆదేశించాలని డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి, టీఎన్‌సీసీ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్, పీఎంకే నేత రాందాసు డిమాండ్ చేస్తున్నారు. తమ పార్టీ వర్గాల నేతృత్వంలో అక్కడి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ కమిటీని బీజేపీ రంగంలోకి దించింది. ఇదిలా ఉండగా, దర్యాప్తు వేగం పెరగడంతో, పోలీసులకు చిక్కకుండా తమ న్యాయవాదుల ద్వారా కోర్టుల్లో లొంగిపోయేందుకు కరస్పాండెంట్ వాసుకీ, చైర్మన్ సుబ్రమణ్యన్, మేనేజర్ వెంకటేష్ ప్రయత్నాలు వేగవంతం చేసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు