స్నాప్‌డీల్‌లో కొట్టేసి.. ఓఎల్ఎక్స్‌లో అమ్మేశారు!

11 Feb, 2017 09:03 IST|Sakshi
స్నాప్‌డీల్‌లో కొట్టేసి.. ఓఎల్ఎక్స్‌లో అమ్మేశారు!
నలుగురు వ్యక్తులు కలిసి మంచి ప్లాన్ వేశారు. స్నాప్‌డీల్ ద్వారా డెలివరీకి వచ్చే సరుకులను దారిలోనే కొట్టేసి, వాటిని ఓఎల్ఎక్స్‌లో పెట్టి అమ్మేశారు. ఒకటి, రెండు రోజులు కాదు.. చాలా కాలం ఇలాగే చేయడంతో చివరకు పట్టుబడ్డారు. వాళ్లలో స్నాప్‌డీల్ సరుకులు చేరవేసే లాజిస్టిక్స్ సంస్థలో పనిచేసే ముగ్గురు డెలియరీ బోయ్‌లు కూడా ఉన్నారు. ఈ నలుగురు కలిసి తప్పుడు పేర్లు, చిరునామాలతో స్నాప్‌డీల్‌లో వివిధ వస్తువులు బుక్ చేసి, ఆ తర్వాత వాటిని తీసేసుకుని వాటి స్థానంలో రాళ్లు, సబ్బులు పెట్టేసి డెలివరీ తీసుకోనట్లుగా వాటిని రిటర్న్ చేసేసేవారు. తీసుకున్న సరుకులను ఎంచక్కా ఓఎల్ఎక్స్‌లో అమ్మేసుకునేవారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన రవికాంత్, హరి ఓం, అమృత్, కరణ్ శర్మ అనే నలుగురిని అరెస్టు చేసి గుర్‌గ్రామ్ కోర్టులో ప్రవేశపెట్టారు. 
 
స్నాప్‌డీల్ తరఫున పార్సిల్స్ తీసుకుని వాటిని నగరంలోని వివిధ ప్రాంతాల్లో డెలివరీ చేసే వల్కన్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏరియా మేనేజర్ రమేష్ కుమార్ గత నెలలో ఈ వ్యవహారంపై ఫిర్ఆయదు చేశారు. విచారణలో ఈ సంస్థలో పనిచేసే డెలివరీ బోయ్‌లే ఈ నేరానికి పాల్పడినట్లు తేలింది. ముందుగా రవికాంత్, హరి ఓం అనే ఇద్దరు డెలివరీ బోయ్‌లను అరెస్టు చేయగా, వాళ్లిచ్చిన సమాచారంతో హరి ఓం అన్న కరణ్‌ను అరెస్టు చేశారు. అతడే మొత్తం కుట్రకు సూత్రధారి. ఖరీదైన వస్తువులు బుక్ చేసి, వాటికి క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో చెల్లింపు ఆప్షన్ పెట్టేవాడు. డెలివరీ బోయ్‌లు అతడి అడ్రస్ సరిగా లేదని చెప్పి వాటిని తిరిగి ఇచ్చేసేవారు. అప్పటికే లోపలి సరుకు మారిపోయేది. సరుకు విలువలో 15% మొత్తాన్ని డెలివరీ బోయ్‌లకు కమీషన్‌గా ఇచ్చేవారు. దాదాపు 50 పార్సిళ్లను ఇలా ఓఎల్ఎక్స్‌లో అమ్మేశారని డీసీపీ క్రైం సుమిత్ కుమార్ తెలిపారు.
మరిన్ని వార్తలు