సరుకు రవాణా పెంచుకోవడంపై రైల్వే దృష్టి

26 Feb, 2016 00:48 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆదాయాల్లో సరుకు రవాణా వాటాను మరింతగా పెంచుకునే దిశగా.. మరిన్ని ఉత్పత్తులను రవాణా చేయడంపై రైల్వే దృష్టి సారిస్తోంది. సరుకు రవాణా జాబితాలో ఆటోమొబైల్, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులతో పాటు మరో 40 పైచిలుకు ఉత్పత్తులను చేర్చాలని యోచిస్తోంది. ప్రస్తుతం బొగ్గు, సిమెంటు, ముడి ఇనుము, ఆహార ధాన్యాలు వంటి సుమారు 10 కమోడిటీలనే ఎక్కువగా రవాణా చేస్తున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ తెలిపారు. అయితే రహదారి మాధ్యమంతో పోటీ పెరిగి రైల్వే ఆదాయాల్లో సరుకు రవాణా విభాగం వాటా తగ్గుతోందని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 36 శాతంగా ఉన్న సరుకు రవాణా విభాగం వాటాను 2024 నాటికి 45 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు మిట్టల్ చెప్పారు.

అలాగే, టారిఫ్‌లను క్రమబద్ధీకరించడం, తొలిసారిగా రవాణా ట్రెయిన్స్‌కు కూడా టైమ్ టేబుల్‌ను ప్రవేశపెట్టడం తదితర చర్యలు పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఆటోమొబైల్‌పై ప్రధానంగా దృష్టి సారిస్తూ కార్ల రవాణా కోసం చెన్నైలో రైల్వేస్ ఆటో హబ్ ఏర్పాటు చేయనున్నట్లు మిట్టల్ చెప్పారు.

మరిన్ని వార్తలు