కృష్ణ నుంచి నైనాగా...

15 Oct, 2015 20:29 IST|Sakshi
కృష్ణ నుంచి నైనాగా...

ఢిల్లీ వాసంత్ వ్యాలీ స్కూలు విద్యార్థిని.. ట్రాన్స్ జెండర్.. ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. నైనా క్వీన్ బీ పేరిట ఆమె నిర్వహిస్తున్న ఛానల్ ను  ఇంటర్నెట్ వినియోగదారులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఏడువేలమందికి పైగా ఆ ఛానల్ ను వీక్షిస్తున్నారు. లింగమార్పిడి తో అతడు (కృష్ణ) నుంచీ ఆమె (నైనా) గా  మారిన తను... తన కుటుంబాన్నే కాక, మొత్తం కమ్యూనిటీకి అండగా నిలిచేందుకు వినూత్న పద్ధతిలో  వాయిస్ వినిపిస్తోంది.

చిన్నతనంలోనే కృష్ణగా ఉండే వికృత రూపం నుంచి... నైనాగా మారిన తన జీవితంలోని ప్రస్తుత అంకం వరకూ ప్రతి సన్నివేశాన్ని ఆమె స్పష్టంగా ఆత్మ విశ్వాసంతో వివరించింది. ఒకప్పుడు అనుభవించిన మానసిక క్షోభను, ఆత్మహత్య చేసుకోవాలన్న తీవ్ర ఆవేదన నుంచి బయటపడి తన గళంతో బాధితులను ఆదుకునేందుకు కృషి చేయాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఉన్నది ఉన్నట్లు వివరించేందుకు వెనుకాడటం లేదు. చివరికి జననేంద్రియాల గురించి మాట్లాడేందుకు కూడా సంకోచించడం లేదు. సరదాగా సంతోషంగా విషయాలను ఆత్మ విశ్వాసంతో వెల్లడించడం ఆమె మొక్కవోని విశ్వాసానికి అద్దం పడుతోంది. ప్రపంచంలో తనవంటి బాధితులెవరైనా, ఎటువంటి సమస్యలనైనా ధైర్యంగా వినిపించేందుకు నైనా స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఓ సంప్రదాయ సౌదీ అరేబియన్ సైతం నైనాను ఆహ్వానించాడని, ఆమెకు చుట్టూ ఎంతోమంది అభిమానులు, ప్రోత్సాహకులు ఉన్నారని ఆమె తల్లి మిషీ సింగ్ చెప్తోంది. నైనాను ప్రతివారూ ఇష్టపడతారని, స్కూల్లో టీచర్లు సైతం నైనాకు అండగా నిలబడటం గర్వంగా అనిపిస్తుందని తెలిపింది. అయితే నైనా టాయిలెట్ విషయంలో మాత్రం కాస్త సమస్యను ఎదుర్కోవాల్సి వస్తోందంటుంది. అమ్మాయిలు వెళ్ళే టాయిలెట్ కు తాను వెళ్ళనని, తాను బాలికనే అయినా ఎందుకు ఆ టాయిలెట్ వాడలేకపోతున్నానో అర్థం కాదని చెప్తుంది.


అంతేకాదు.. టాయిలెట్ గురించి ఎవరైనా అడిగితే కొంత బాధకు గురైనట్లు కూడ ఆమెకు సంబంధించిన యూట్యూబ్ వీడియోల్లో కనిపిస్తుంది. అయితే తనవంటివారి సమస్యలపై స్వయంగా పోరాడేందుకు నైనా ఆత్మ విశ్వాసంతో ఉందని ఆమె తల్లి మిషి చెప్తోంది. తన అనుభవసారాన్ని ఉపన్యాసాలుగా వినిపించడంతోపాటు, ఠాగూర్ ఇంటర్నేషనల్ లోనూ ఆమె సమస్యలపై వ్యాఖ్యానిస్తోంది. త్వరలో ఢిల్లీ విశ్వవిద్యాలయానికి వెళ్ళేందుకు ఆమె సిద్ధమౌతోంది.

మరిన్ని వార్తలు