చీర, మంగళసూత్రం ఉంటే ఎయిర్‌పోర్టులో కష్టమే!

17 Jan, 2017 09:01 IST|Sakshi
చీర, మంగళసూత్రం ఉంటే ఎయిర్‌పోర్టులో కష్టమే!
భారతీయ మహిళలు సంప్రదాయబద్ధంగా మెడలో ధరించే మంగళసూత్రం, మడతలు మడతలుగా భారీ మెటల్ వర్కుతో ఉండే చీరలు.. ఇవన్నీ ఉంటే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇబ్బందేనట. ఎందుకంటే.. అక్కడ కొత్తగా ఏర్పాటుచేసిన అమెరికా కంపెనీ వాళ్ల ఫుల్ బాడీ స్కానర్ వీటి గుండా శరీరాన్ని స్కాన్ చేయలేకపోతోంది. భారతీయ విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు వీలుగా ఫుల్ బాడీ స్కానర్లను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఇందుకోసం అంతర్జాతీయంగా కొటేషన్లు పిలవగా అమెరికన్, జర్మన్ కంపెనీలు తమ స్కానర్లు పంపాయి. ఇప్పటికి అమెరికన్ స్కానర్‌ను పరీక్షించారు. ఇక జర్మన్ స్కానర్ ఏం చేస్తుందో చూడాలి. 
 
భారతీయ మహిళలు పలు మడతలు పెట్టి ధరించే చీరల కారణంగా ఈ స్కానర్లు అంత సమర్థంగా చెక్ చేయలేకపోతున్నాయని విమానాశ్రయంలో భద్రతను పర్యవేక్షించే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) బలగాలు తెలిపాయి. అలాగే చాలామంది మహిళలు తాము ధరించే మంగళ సూత్రాలను తాత్కాలికంగానైనా తీసి పక్కకు పెట్టడానికి నిరాకరిస్తున్నారు. దాంతో భద్రతా దళాలకు కొంత ఇబ్బంది కలుగుతోంది. ప్రధానంగా ఈ రెండు సమస్యలు తప్ప మిగిలిన అన్ని రకాలుగా అమెరికన్ స్కానర్లు బాగానే పనిచేస్తున్నాయని సీఐఎస్ఎఫ్ తెలిపింది. 
 
మెడ నుంచి కాలి వరకు శరీరం మొత్తాన్ని ఇది స్కాన్ చేస్తుందని, అయితే తాము పూర్తి శరీరాన్ని స్కాన్ చేసే మిషన్ అడిగామని సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. స్కానింగ్ చేసేముందు శరీరం మీద ఉన్న అన్ని రకాల మెటల్ వస్తువులు తీసేయాలని.. పురుషులు తమ బెల్టులు, వాలెట్లు తీస్తున్నారు గానీ మహిళలు మాత్రం మంగళసూత్రాలను తీసి ట్రేలో పెట్టమంటే ఒప్పుకోవడం లేదని అన్నారు. స్కానింగ్‌ను తప్పనిసరి చేస్తే హిందూ మహిళలను ఒప్పించడం చాలా కష్టం అవుతుందని తెలిపారు. చీర కట్టుకున్నా, మంగళసూత్రం ఉన్నా స్కానర్ నుంచి అలారం వస్తుందని.. ఇది ఎందుకు వచ్చిందో తెలుసుకోవడం కష్టమని వివరించారు. చీరల్లో అయితే అనేక పొరలుంటాయి. అదే జీన్స్ లేదా ఇతర దుస్తుల్లో అలా ఉండవు. దానికి తోడు చాలామంది చీరల మీద భారీగా వర్క్‌ చేయించుకుంటారు. దానివల్ల కూడా స్కానర్ పదే పదే కూతలు పెడుతుంది. పదివేల స్కాన్లలో ఒక్కసారి మాత్రం పెన్ను, వాలెట్, కర్చీఫ్ తదితర వస్తువులను ఇది గుర్తించలేకపోతోంది. ఇప్పటివరకు అమెరికన్ స్కానర్‌ను పరిశీలించామని, ఇక జర్మన్ స్కానర్‌ను కూడా చూడాల్సి ఉందని సీఐఎస్ఎఫ్ అధికారి ఒకరు చెప్పారు. ట్రయల్ రన్ పూర్తయితే, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ (బీసీఏఎస్) ఫుల్ బాడీ స్కానింగ్‌ను తప్పనిసరి చేసేందుకు కావల్సిన నియమ నిబంధనలు సిద్ధం చేస్తుంది.
>
మరిన్ని వార్తలు