క్లింటన్కే తలపాగా చుట్టిన గజేంద్రుడు!

23 Apr, 2015 14:23 IST|Sakshi
క్లింటన్కే తలపాగా చుట్టిన గజేంద్రుడు!

న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వేలాదిమంది ప్రజల సమక్షంలో ఆత్మహత్య చేసుకున్న రాజస్థాన్ రైతు గజేంద్ర సింగ్ చుట్టూ రాజకీయాలు కేంద్రీకృతమయ్యాయి. దీంతో గజేంద్ర సింగ్ ఎవరు? నిజంగా రైతేనా, అకాలవర్షాల కారణంగా ఆయన పంట నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడా? అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డాడా? లేక ఇంకా ఏమైనా కారణాలున్నాయా?....ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుక్కునేందుకు జాతీయ మీడియా యావత్తు రాజస్థాన్‌లోని దౌసా గ్రామానికి దౌడ్ తీసింది. సాక్షాత్తు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్కే తలపాగా చుట్టిన చరిత్ర గజేంద్రసింగ్కు ఉంది. దీంతోపాటు.. ఆయన స్వగ్రామంలో మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యపానానికి, వరకట్నానికి వ్యతిరేకంగా పలు ఆందోళనలు చేసి ప్రజల ప్రశంసలు అందుకున్న గజేంద్ర సింగ్‌కు రాజకీయ నేపథ్యం కూడా ఉంది. బీజేపీతో మొదలైన ఆయన రాజకీయాలు, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మీదుగా ఆమ్ ఆద్మీ పార్టీకి చేరుకున్నాయి. ఇప్పుడు ఆ పార్టీలే ఆ రైతు ఆత్మహత్య పట్ల పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.

దౌసా గ్రామస్థుల కథనం ప్రకారం: గజేంద్ర సింగ్ 2003లో బీజేపీలో చేరారు. తహసిల్‌లో జరిగిన పలు పార్టీ సభలూ, సమావేశాల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ టెక్కెట్ ఆశించి భంగపడ్డాడు. దాంతో సమాజ్‌వాదీ పార్టీ టెక్కెట్‌పై అసెంబ్లీకి పోటీచేశాడు. బీజేపీ అభ్యర్థి అల్కాసింగ్ చేతుల్లో ఓడిపోయాడు. 2013 వరకు ఆయన ఆ పార్టీలోనే కొనసాగి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర సమితి క్రియాశీలక సభ్యుడిగా కొనసాగాడు. తర్వాత అసెంబ్లీ టిక్కెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.  ఆ పార్టీలో టిక్కెట్ రాకపోవడంతో చివరకు ఆమ్ ఆద్మీని ఆశ్రయించాడు.

గజేంద్ర సింగ్ ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది. ఆయనది విశాలమైన పక్కా భవంతి. దాదాపు 8 ఎకరాల వ్యవసాయ భూమి. జామ, ఉసిరి తోట ఉంది. ఇంటి ఎదురుగానే టేకు వనం ఉంది. ఇటీవలి అకాల వర్షాల వల్ల గోధుమ, ఆవాల పంట నాశనం అయింది. ఆ పంట నష్టం కూడా 25 శాతానికి మించి ఉండదని జిల్లా అధికారులు తెలిపారు. గజేంద్రకు 12వ తరగతి చదువుతున్న ఒ ఆడపిల్ల, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు లేవు. ఆత్మహత్య చేసుకునేంత మనోదౌర్బల్యం కూడా లేదు. పది మందికీ సహాయం చేసే మంచి గుణం కూడా ఉంది. ఆయన వ్యవసాయాన్ని కూడా అంతగా పట్టించుకునేవాడు కాదట.

జైపూర్‌లో పర్యాటకులకు రాజస్థాన్ సంప్రదాయ తలపాగా చుట్టడమే పనిగా పెట్టుకొని అలా వచ్చే డబ్బులతో అక్కడే ఎక్కువకాలం జీవించేవాడు. కేవలం 20 సెకడ్లలో తలపాగా చుట్టే నేర్పరిగా పేరు తెచ్చుకున్న గజేంద్ర రాజస్థాన్ సాంస్కృతిక శాఖ నుంచి 'మిస్టర్ డిసర్ట్' అనే టైటిల్ కూడా అందుకున్నారు. బిల్ క్లింటన్‌ 2000 సంవత్సరంలో రాజస్థాన్లో పర్యటించినప్పుడు ఆయనకు తలపాగా చుట్టారు. ఇంకా పలువురు విదేశీ నేతలకు తలపాగా చుట్టిన ఆయన గతంలో వాజపేయి, ఇటీవల కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు కూడా తలపాగా చుట్టిన ఫొటోలను ఆయన మిత్రులు చూపించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా కృషిచేస్తానని ఢిల్లీ వెళ్లేముందు గ్రామస్థులకు మాట ఇచ్చాడట. కేజ్రీవాల్‌ను స్వయంగా కలుసుకునేందుకు మూడు రోజులు ముందుగానే ఢిల్లీ వెళుతున్నానని చెప్పాడని ఆయన మేనల్లుడు అమిత్ సింగ్ తెలిపాడు. జంతర్ మంతర్ వద్ద చెట్టెక్కి టీవీలను ఆకర్షించినప్పుడు 'చూస్కో నేను టీవీలో కనిపిస్తున్నాను' అని తనకు ఫోన్‌చేసి చెప్పాడని ఆయన తమ్ముడు విజేంద్ర సింగ్ తెలిపాడు.

ఆయనకు ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా కుటుంబ సమస్యలు ఉన్నాయని, పలుసార్లు ఇల్లు విడిచి వెళ్లి పోవాలనుకున్నాడని కొంత మంది గ్రామస్థులు తెలిపారు. ఏదేమైనా ఆత్మహత్య చేసుకునే బలహీనుడు మాత్రం గజేంద్రసింగ్ కాడని గ్రామస్థులు ఏకమాటగా చెప్పారు. దీంతో ప్రమాదవశాత్తు ఆయన చెట్టుమీది నుంచి జారిపడ్డాడా? అనే కొత్త ప్రశ్న పుట్టుకొచ్చింది. ఈ దిశగా కూడా ఇప్పుడు ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వార్తలు