ఉండ్రాళ్లయ్యా.. వీడ్కోలయ్యా..

28 Sep, 2015 02:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ముంబై తర్వాత అత్యంత వైభవంగా గణేశ్ ఉత్సవాలు జరిగే హైదరాబాద్‌లో వినాయకుడి శోభాయాత్ర  ఆదివారం కన్నుల పండువగా జరిగింది. లక్షలాది మంది భక్తులు గణపతి విగ్రహాల వెంట తరలి రావడంతో మహానగర రహదారులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ‘గణపతి బప్పా మోరియా...ఆదా లడ్డూ ఖాలియా’ నినాదాలతో భక్తిమయ వాతావరణం నెలకొంది. హుస్సేన్‌సాగర్, సఫిల్‌గూడ, సరూర్‌నగర్ చెరువులతో పాటు 9 పెద్ద, 30 చిన్న చెరువుల్లో గణేశ్ నిమజ్జనం పోలీసుల పర్యవేక్షణలో భక్తుల సహకారంతో సాఫీగా సాగుతోంది. ప్రధాన శోభాయాత్ర జరిగే మార్గంతో పాటు ఇతర మార్గాల నుంచి ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌కు గణపతులతో వేలాది వాహనాలు తరలివచ్చాయి. వేలాది గణపయ్యల రాకతో హుస్సేన్ సాగర్ తీరం పులకించి పోయింది. ‘జై జై గణేశా.. బై బై గణేశా’ అంటూ పిల్లలు, యువతులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. వేలాది సంఖ్యలో విగ్రహాలు ఉండటంతో నిమజ్జనం కార్యక్రమం సోమవారం సాయంత్రం వరకూ కొనసాగొచ్చని పేర్కొన్నారు.
 
 భద్రత కట్టుదిట్టం..
 హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో దాదాపు 30 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. వీరితో పాటు శోభాయాత్ర జరిగే ప్రధాన మార్గంతో పాటు ఇతర మార్గాల్లో సీసీటీవీ కెమెరాలతో అనుక్షణం నిఘా పెట్టారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు.
 
 నేతల సందడి..
 శోభాయాత్రలో వివిధ పార్టీల నాయకులు సందడి చేశారు. హైదరాబాద్ ఎంజే మార్కెట్ చౌరస్తాలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన గణేశ్ ఊరేగింపులో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ పాల్గొన్నారు. దేశం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతోందని, స్వాతంత్య్ర సంగ్రామ స్ఫూర్తితో ప్రారంభమైన గణేశ్ ఉత్సవాలు దేశమంతా జరుపుకోవడం సంతోషంగా ఉందని వెంకయ్య పేర్కొన్నారు.
 
 ఆలస్యంగా మొదలైన యాత్ర..
 హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు దాదాపు రోడ్లన్నీ నిర్మానుష్యం గా కనిపించాయి. ఆ తర్వాతే విగ్రహాల ఊరేగింపు సందడి కనిపించింది. ఎప్పుడూ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే బాలాపూర్ గణపతి యాత్ర ఈసారి ఆలస్యం గా మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. విశేష పూజలందుకున్న ఖైరతాబాద్ త్రిశక్తిమయ మోక్షగణపతిని సోమవారం సాయంత్రంలోగా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ గణపతిని దర్శించుకునేందుకు ఆదివారం అర్ధరాత్రి వరకు భక్తులకు అనుమతిచ్చారు. ఖైరతాబాద్ గణేశుని చేతిలోని లడ్డూ ప్రసాదాన్ని ఈ నెల 30న భక్తులకు పంచిపెట్టనున్నారు.  
 
 కూకట్‌పల్లి లడ్డూకు రూ.15 లక్షలు
హైదరాబాద్ కూకట్‌పల్లి అడ్డగుట్ట లడ్డూకు ఈసారి అత్యధికంగా రూ.15 లక్షలు పలికింది. ఏటా అత్యధిక ధర పలికే బాలాపూర్ లడ్డూను వెనక్కి నెట్టి మొదటి స్థానం లో నిలవడం విశేషం. కూకట్‌పల్లి లడ్డూను వ్యాపారవేత్త నల్లమిల్లి జనార్దన్‌రెడి దక్కిం చుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో వెంగళరావునగర్ కాలనీలోని మధురానగర్‌లోని గణేశ్ లడ్డూ రూ.10.4లక్షలు పలికింది. సాయిసుఫల కన్‌స్ట్రక్షన్స్, సాయితేజ కన్ స్ట్రక్షన్స్ అధినేతలు భాస్కర్‌రావు, శ్రీనివాసరావు దక్కిం చుకున్నారు. బాలాపూర్ లడ్డూను ఈసారి రూ.10.32 లక్షలకు స్థానికుడు కళ్లెం మదన్‌మోహన్‌రెడ్డి సొంతం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు