నేను...ఆ టైపు కాదు!

4 Sep, 2015 10:50 IST|Sakshi
గౌతమ్ సవాంగ్

విజయవాడ సిటీ : ‘కొత్తలో హడావుడి మామూలే అనుకోవడం పరిపాటి. నేను ఆ టైపు కాదు. ఒక్కొక్క విషయాన్ని నిశితంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. తద్వారా ప్రజలకు దీర్ఘకాలిక మేలు జరగాలనేది నా అభిప్రాయం. పోలీసులు అంతర్గతంగాను.. బహిర్గతంగా మారాలి. అప్పుడే ఫ్రెండ్లీ పోలీసింగ్ సాధ్యం’ అంటూ నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతమ్ సవాంగ్ చెప్పారు. నగర పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తయిన సందర్భంగా గురువారం కమిషనరేట్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇక్కడ మోసగాళ్లు అధికంగా ఉన్నారనే విషయం గుర్తించినట్టు చెప్పారు. ‘వీరిని గట్టిగా నియంత్రించాలి. నిక్కచ్చిగా ముందుకు వెళుతుంటే ఆపాలంటూ ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లు వచ్చినంత మాత్రాన విధి విధానాలు మార్చుకోవడం కుదరదు’ అని స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
 
పోలీసులు కనిపించాలి
రద్దీ వేళల్లో రోడ్లపై పోలీసులు కనిపించాలి. అప్పడే ప్రజలకు పోలీసులు ఉన్నారనే భరోసా కలుగుతుంది. ముందు దీనిపై దృష్టి పెట్టాను. ఇప్పటికే రద్దీ వేళల్లో తిరగాలంటూ అందరికీ ఆదేశాలు జారీ చేశాను. కొద్ది రోజులు గడిచిన తర్వాత రద్దీ వేళల్లో ఏంచేయాలనే దానిపై నిర్దిష్ట కార్యాచరణ ప్రకటిస్తాను.
 
 విటులను బయటకు లాగుతాం
వ్యభిచార వృత్తిని ఉపేక్షించేది లేదు. మహిళలు, యువతులతో వ్యాపారం చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. పలు ప్రాంతాల్లో వ్యభిచార నిర్వాహకులు ఇళ్లను అద్దెకు తీసుకొని కార్యకలాపాలు సాగిస్తున్నట్టు గుర్తించాం. ఆన్‌లైన్ ద్వారా విటులను రప్పించుకొని వ్యాపారం చేస్తున్నారు. వీరిని పట్టుకోవడంతో పాటు తరచూ వీరి వద్దకు వచ్చే విటులను కూడా బయటకు లాగి మీడియా సమక్షంలో వెల్లడిస్తాం.
 
గుట్కాను తరిమి కొడతాం
ప్రమాదకర క్యాన్సర్‌కు కారణమైన గుట్కాను నగరం నుంచి తరిమికొడతాం. గుట్కా మాఫియాకు సంబంధించిన ఆధారాలు కొంతవరకు సేకరించాం. మరికొంత సమాచారం రావాల్సి ఉంది. ఆపై పోలీసుల చర్యలు ఎలా ఉంటాయో గుట్కా మాఫియాకు రుచి చూపుతాం. తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేసే డాక్యుమెంటు రైటర్లను వదిలేది లేదు. రాజధాని నేపథ్యంలో భూముల విలువలు భారీగా పెరిగాయి. ఒకే స్థలానికి ఒకటికి మించి డాక్యుమెంట్లు తయారుచేసేవారి సంఖ్య పెరిగింది. తప్పుడు డాక్యుమెంట్లతో స్థలాల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్టు తెలిసింది. భూ వివాదాల సమయంలో డాక్యుమెంట్లు నకిలీవని తేలితే తయారు చేసిన డాక్యుమెంటు రైటర్‌ను ప్రాసిక్యూట్ చేస్తాం. ఎవరి ప్రోద్బలంతో తప్పుడు డాక్యుమెంటు తయారు చేశారనేది నిర్ధారించి బాధితులకు న్యాయం చేస్తాం.
 
 అలసత్వం ఉపేక్షించను
పోలీసు అధికారుల్లో అలసత్వాన్ని ఉపేక్షించను. స్టేషన్‌కి వచ్చే బాధితులతో మంచిగా మాట్లాడటం పోలీసుల బాధ్యత. ఇందుకు ఖర్చేముంటుంది? కచ్చితంగా స్టేషన్‌కి వచ్చేవారితో మంచిగా మాట్లాడి, చెప్పేది విని న్యాయం చేయాల్సిందే. ఇందుకు విరుద్ధంగా జరిగితే ఉపేక్షించేది లేదు. ఇప్పుడిప్పుడే దీనిపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చాను. మారకుంటే మార్చేస్తాను.

మరిన్ని వార్తలు