ఫేస్‌బుక్‌లో మహిళా అధికారి సంచలన పోస్టు!

29 Aug, 2016 18:44 IST|Sakshi
ఫేస్‌బుక్‌లో మహిళా అధికారి సంచలన పోస్టు!

సాక్షాత్తు ఓ మంత్రి వేధిస్తున్నారంటూ బళ్లారీలోని కుడ్లిగి డీఎస్పీ అనుపమ షెనాయ్‌ తన పదవికి రాజీనామా చేసి రెండునెలలైన గడవకముందే మరో అధికారిణి కర్ణాటక పోలీసుశాఖపై తీవ్ర ఆరోపణలు చేశారు. బళ్లారీ పోలీసు స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న గాయత్రి ఫర్హాన్‌ సోమవారం సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్టు సంచలనం సృష్టించింది. 'మహిళలను అధికారులుగా గుర్తించడం కష్టతరంగా కనిపిస్తోంది. నా కెరీర్‌ మొదలైన నాటినుంచి నేను దీనిని స్వయంగా అనుభవిస్తున్నా. డిపార్ట్‌మెంట్‌లో మహిళలు ఎంతోగానో శ్రమించినా.. వారి పనితీరుకు పురుషులకు లభించినంతగా గుర్తింపు రావడం లేదు' అంటూ గాయత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

'డిపార్ట్‌మెంట్‌లో వారానికి ఏడు రోజులు, 24 గంటలూ పనిచేసినా అంతా వృథా అవుతోంది.  డిపార్ట్‌మెంట్‌లోని పరిస్థితులకు అలవాటు పడేందుకు నాకు ఏడేళ్లు పట్టింది. కొన్ని ఘటనలు చూస్తే కన్నీళ్లు వచ్చేవి. కానీ అవి నన్ను, నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని ఎప్పుడూ నా కన్నీళ్లను చూపలేదు. ఇప్పుడు సమర్థతపైనే నాలో ప్రశ్నలు  రేకెత్తుతున్నాయి. మా బ్యాచ్‌ డిపార్ట్‌మెంట్‌లో అడుగుపెట్టి సెప్టెంబర్‌ 1తో పన్నెండేళ్లు పూర్తికావొస్తున్నది. అయినా ఉద్యోగంలో సంతృప్తి లేదు. సమాజంలోనూ, వృత్తిజీవితంలోనూ మహిళ తన ఉనికిని నిలబెట్టుకోవడం కష్టంగా మారింది. 'చెయ్యి లేదా చావు' అన్న పరిస్థితి నెలకొంది' అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కర్ణాటక పోలీసు శాఖపై మహిళా అధికారులు ఇటీవల తీవ్ర ఆరోపణలు చేయడం సిద్ధరామయ్య సర్కార్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. కార్మికశాఖ మంత్రి పీటీ పరమేశ్వరన్‌ నాయక్‌ వేధిస్తున్నారంటూ బళ్లారీ డీఎస్పీ అనితా షెనాయ్‌ రాజీనామా చేయడం పెద్ద దుమారం రేపింది. తాజాగా పోలీసుశాఖలో మహిళలపట్ల తీవ్ర లింగవివక్ష పాటిస్తున్నారంటూ గాయత్రి ఫర్హాన్‌ ఆవేదన వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు