ట్రంప్‌ ట్రింఫ్‌.. ఓ టెక్నాలజీ అద్భుతం

25 Jan, 2017 13:05 IST|Sakshi
ట్రంప్‌ ట్రింఫ్‌.. ఓ టెక్నాలజీ అద్భుతం

వాషింగ్టన్‌: ‘డొనాల్డ్‌ జాన్‌ ట్రంప్‌ అనే నేను అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడిగా విశ్వసనీయతతో విధులు నిర్వర్తిస్తానని, దేశ సంరక్షణకు శాయశక్తులా కృషిచేస్తానని, సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను’ అంటూ లక్షలమంది సాక్షిగా వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ భవనంలో ట్రంప్‌.. అసలైన ట్రింఫ్‌ (విజయోత్సవం) జరుపుకున్నారు.

అదే వేదికపై అధ్యక్షుడి హోదాలో ఆయన చేసిన తొలి ప్రసంగం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అన్నిదేశాల్లోని వార్తాపత్రికలు, న్యూస్‌ చానెళ్లు ట్రంప్‌ ప్రమాణ స్వీకారాన్ని హైలైట్‌ చేశాయి. అయితే అమెరికాలోని కొన్ని మీడియా సంస్థలు మాత్రం ట్రంప్‌ చిన్నబుచ్చుకునేలా.. జనంలేని ప్రదేశాల ఫొటోలను ప్రధానంగా ప్రచురించాయి. ఆగ్రహంతో ఊగిపోయిన ట్రంప్‌.. జర్నలిస్టులను నీతిలేని వాళ్లంటూ తిట్టిపోశారు. ఈ గొడవ సంగతి పక్కనపెడితే.. ట్రంప్‌ ట్రింఫ్‌ సందర్భంగా ‘సీఎన్‌ఎన్‌’ చిత్రీకరించిన ఫొటో ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

క్యాపిటల్‌ భవనంపై ట్రంప్‌ ప్రసంగిస్తుండగా, బిడ్డింగ్‌తోపాటు సుదూరంలో ఉన్న జనాలను సైతం కవర్‌చేస్తూ 360 డిగ్రీల కోణంలో ఓ గిగాపిక్సల్‌ ఫొటోను తీశారు. దూరం నుంచి తీసినప్పటికీ, ఫొటోను జూమ్‌ చేస్తూ పోయేకొద్దీ అక్కడున్న అందరి ముఖాలను స్పష్టంగా చూడొచ్చు. కుడి, ఎడమలకు పాన్‌ చేస్తూ 360 డిగ్రీల అనుభూతిని పొందొంచ్చు. టెక్నాలజీ పరంగా అద్భుతమంటూ ప్రశంసలు పొందుతున్న ఫొటోను మీరూ చూసి ఆనందించాలనుకుంటే..
ఇక్కడ క్లిక్‌ చేయండి.

 

మరిన్ని వార్తలు