ఆ స్కూల్లో చదివి టాపర్ అయింది!

30 Jan, 2017 11:38 IST|Sakshi
ఆ స్కూల్లో చదివి టాపర్ అయింది!

త్రాల్: కల్లోల ప్రాంతంలో విద్యా సుమం విరిసింది. అడ్డంకులను అధిగమించి అగ్రస్థానంలో నిలిచింది. జమ్మూకశ్మీర్ త్రాల్ జిల్లా దాద్సారా గ్రామానికి చెందిన 18 ఏళ్ల షహీరా అహ్మద్ ఇంటర్ పరీక్షల్లో టాపర్ గా నిలిచింది. భద్రతా దళాల కాల్పుల్లో హతమైన హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ చదివిన పాఠశాలలో ఆమె చదవడం విశేషం. ఇంటర్ పరీక్షల్లో 500 మార్కులకు 498 మార్కులు సాధించి టాపర్ గా నిలిచింది.

గతేడాది జూలైలో వనీ హతమైన తర్వాత అల్లర్లు చెలరేగడంతో దాదాపు 5 నెలలు విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో షహీరా సాధించిన ఘనత స్ఫూర్తిదాయకంగా నిలిచింది. సంక్షోభాలు ఎదురైనా సడలని సంక్పలంతో ఈ ‘చదువుల తల్లి’  విద్యార్థులకు ప్రేరణ అయింది. ‘చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా మనసును చదువు మీదే లగ్నం చేశాను. ఇతర విషయాలవైపు మళ్లకుండా స్వీయనియంత్రణ పాటించాను. కల్లోల పరిస్థితుల మధ్యే నేను పెరిగాను. చదువు కొనసాగించాలన్న దృఢ చిత్తంతో ముందుకు సాగుతున్నాన’ని షహీరా వివరించింది.

టెన్త్ పరీక్షల్లోనూ ఆమె ప్రతిభ చూపింది. రాష్ట్రవ్యాప్తంగా రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈసారి కశ్మీర్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఆమె చదువుకు ఆటంకం కలిగిస్తాయని తల్లిదండ్రులు భయపడ్డారు. ‘కల్లోల పరిస్థితుల్లో నడుమ షహీరా చదువు కొనసాగించాలని మాకు తెలుసు. ఇది చాలా కష్టంతో కూడుకున్నది అయినప్పటికీ ఆమె తన దృష్టిని చదువు మీద నుంచి మళ్లించలేద’ని షహీరా తల్లి తస్లిమా వెల్లడించింది.

వేర్పాటువాదుల సానుభూతిపరులకు నిలయంగా పేరుగాంచిన దాద్సారా గ్రామంలో ఉద్రిక్తతలు నిత్యకృత్యం. ఎంతో మంది తీవ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. బుర్హాన్ వనీ హతమైన తర్వాత కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ‘కమ్యూనిటీ స్కూలింగ్’  షహీరాకు ఎంతో మేలు చేసిందని ఆమె తండ్రి షమీన్ అహ్మద్ తెలిపారు. ‘షహీరా స్వయంగా కమ్యూనిటీ టీచర్ల వద్దకు వెళ్లేది. ఒకరు ఫిజిక్స్ క్లాసులు చెబితే మరొకరు మ్యాథ్స్ క్లాస్ తీసుకునే వారు. ఇంకొరు కెమిస్ట్రీ.. ఈ విధంగా కమ్యూనిటీ టీచర్ల సహాయంలో షహీరా సిలబస్ పూర్తి చేసింద’ని అహ్మద్ వివరించారు.

మరిన్ని వార్తలు