తమిళనాడు హైవే ప్రాజెక్టును విక్రయించిన జీఎంఆర్

18 Sep, 2013 03:08 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ గ్రూపు తమిళనాడులోని 73 కి.మీ తిండివనం - ఉలుండుర్‌పేట్ జాతీయ రహదారి ప్రాజెక్టులో మెజార్టీ వాటాను విక్రయించింది. ‘అసెట్ రైట్ - అసెట్ లైట్’ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టులోని 74 శాతం వాటాను రూ.222 కోట్లకు ఐడీఎఫ్‌సీకి చెందిన ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్‌కి విక్రయించింది. ఈ డిజిన్వెస్ట్‌మెంట్ వలన కంపెనీ రుణ భారం రూ.459 కోట్లు తగ్గడమే కాకుండా రూ.222 కోట్లు చేతికి వచ్చినట్లు జీఎంఆర్ గ్రూపు సీఎఫ్‌వో మధు తెర్దల్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఐడీఎఫ్‌సీ ఇన్‌ఫ్రా ఫండ్ 1,878 కి.మీ రహదారులను నిర్వహిస్తున్నట్లు ఐడీఎఫ్‌సీ మేనేజింగ్ పార్టనర్, సీఈవో ఎం.కె.సిన్హా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం జీఎంఆర్‌కి రూ.33,000 కోట్ల అప్పులు ఉండగా, ఆస్తుల విలువ రూ.52,000 కోట్లు వరకు ఉన్నట్లు మంగళవారం జరిగిన వార్షిక సర్వ సభ్య సమావేశంలో పేర్కొంది. అప్పుల భారాన్ని  తగ్గించుకోవడానికి మరిన్ని ఆస్తులను విక్రయించనున్నట్లు ఈ సమావేశంలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు