జీఎంఆర్ ఇన్‌ఫ్రాకు విద్యుత్ షాక్

13 Feb, 2014 01:32 IST|Sakshi
జీఎంఆర్ ఇన్‌ఫ్రాకు విద్యుత్ షాక్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఇన్‌ఫ్రా మూడో త్రైమాసికంలో రూ.441 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. గత సంవత్సరం ఇదే కాలానికి నష్టం రూ.217కోట్లుగా ఉంది. ఇంధన సరఫరా లేక విద్యుత్ ప్రాజెక్టులు పనిచేయకపోవడం, కొత్తగా రెండు విద్యుత్ ప్రాజెక్టులు ఈ త్రైమాసికంలోనే ఉత్పత్తి ప్రారంభించడం నష్టాలు పెరగడానికి కారణంగా జీఎంఆర్ ఇన్‌ఫ్రా ఒక ప్రకటనలో తెలిపింది.

 కేవలం ఒక్క విద్యుత్ రంగం నుంచే రూ.333 కోట్ల నష్టాలు వచ్చాయి. ఇదే సమయంలో ఎయిర్‌పోర్ట్ విభాగం రూ.50 కోట్ల లాభాలను ఆర్జించింది. గత సంవత్సరం ఇదే కాలానికి ఎయిర్‌పోర్ట్ విభాగం కోటి రూపాయల నష్టాలను నమోదు చేసింది. సమీక్షా కాలంలో ఆదాయం 9 శాతం వృద్థితో రూ.2,382 కోట్ల నుంచి రూ.2,638 కోట్లకు పెరిగినట్లు జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జి.ఎం.రావు ప్రకటనలో తెలిపారు.

 ఆస్తుల విక్రయం: అసెట్ లైట్, అసెట్ రైట్ కార్యక్రమంలో భాగంగా ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్ట్‌లో వాటాలను విక్రయించడం జరిగిందని, ఇదే సమయంలో ఉలందూర్‌పేట్ ఎక్స్‌ప్రెస్ హైవేలో 74 శాతం వాటా విక్రయానికి సంబంధించి చర్చలు తుది దశలో ఉన్నట్లు జీఎంఆర్ ఇన్‌ఫ్రా పేర్కొంది.

 బుధవారం బీఎస్‌ఈలో జీఎంఆర్ ఇన్‌ఫ్రాషేరు  స్వల్ప లాభాలతో రూ.19.90 వద్ద ముగిసింది.
 

మరిన్ని వార్తలు