‘విజయవాడ హైవే’లో వాటా సేల్!

2 Jan, 2014 05:43 IST|Sakshi
‘విజయవాడ హైవే’లో వాటా సేల్!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆస్తుల్ని తగ్గించుకోవటానికి పెట్టుకున్న ‘అసెట్ లైట్’ కార్యక్రమాన్ని జీఎంఆర్ వేగవంతం చేస్తోంది. మూడు రోజుల క్రితమే టర్కీ ఎయిర్‌పోర్టు నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన జీఎంఆర్ తాజాగా మరో హైవే ప్రాజెక్టును విక్రయించే ఆలోచనలో పడింది. విజయవాడ-హైదరాబాద్ మధ్య నిర్మించిన 181.5 కి.మీ హైవే ప్రాజెక్టులో మెజార్టీ వాటాను అమ్ముతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులో జీఎంఆర్‌కు 74 శాతం వాటా ఉంది. దీన్లో 48 శాతం వాటాను మోర్గాన్ స్టాన్లీ ఇన్‌ఫ్రా ఫండ్ కొనుగోలు చేయడానికి ముందుకొచ్చినట్లు తెలిసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి జీఎంఆర్ తన వాటాగా రూ. 1,740 కోట్లు ఖర్చుపెట్టింది.

 ప్రస్తుతం 48 శాతం వాటాకు రూ. 800 నుంచి రూ.900 కోట్లు చెల్లించడానికి మోర్గాన్ స్టాన్లీ ఫండ్ మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఇదే విషయమై కంపెనీ రహదారుల విభాగం ఎండీ భుజంగరావును ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధి సంప్రదించగా... మార్కెట్ స్పెక్యులేషన్స్ గురించి తామేమీ చెప్పలేమన్నారు. ‘‘వాటా విక్రయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై రంగరాజన్ క మిటీ చేసే సిఫారసులను చూశాకే దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటాం. అయినా మేం మా ప్రాజెక్టుల్లో వాటాలను పునర్వ్యవస్థీకరించాలనుకుంటున్నామే తప్ప పూర్తిగా వైదొలగాలనుకోవటం లేదు. ఈ ప్రాజెక్టులో కూడా కనీసం 26 శాతం వాటా ఉంచుకోవాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. రంగరాజన్ కమిటీ సిఫారసులను చూసి నిర్ణయం తీసుకోవటానికి రెండు మూడు నెలల సమయం పడుతుందని ఆయన చెప్పారు. అయితే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు మాత్రం మొత్తం ప్రక్రియ ఏడెనిమిది నెలల్లో పూర్తయిపోతుందని చెబుతుండటం గమనార్హం.

 బ్యాలెన్స్ షీటు విలువకు రెండున్నర రెట్లు అధికంగా... దాదాపు 40వేల రూపాయల రుణాల్ని కలిగి ఉన్న జీఎంఆర్... వీటిని తగ్గించుకోవడానికి వివిధ ప్రాజెక్టులను విక్రయిస్తోంది. ఇప్పటికే జడ్చర్ల, తమిళనాడు హైవేలను, కొన్ని విద్యుత్, ఎయిర్‌పోర్టు ప్రాజెక్టుల్లో వాటాలను విక్రయించింది. ఇవికాక నేపాల్‌లో ఉన్న రెండు విద్యుత్ ప్రాజెక్టుల్లో వాటాలను రూ. 1,000 కోట్లకు విక్రయిస్తోందన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులనూ విక్రయిస్తే జీఎంఆర్‌కు రూ.100 కోట్ల రుణ వడ్డీ భారం తగ్గుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 బుధవారం ఎన్‌ఎస్‌ఈలో జీఎంఆర్ షేరు స్వల్పంగా పెరిగి రూ.24.85 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు