రెండేళ్లలో రెండు కోట్ల సంపాదన!

8 Aug, 2015 17:13 IST|Sakshi
రెండేళ్లలో రెండు కోట్ల సంపాదన!

ఏడాదికి దాదాపు కోటి రూపాయల సంపాదన సాధ్యమేనా? అది కూడా ఒక న్యాయవాదికి! గోవా అడ్వకేట్ జనరల్ ఆత్మారామ్ నదకర్ణి మాత్రం ఇలా సంపాదించారు. గడిచిన రెండేళ్లలో గోవాతో పాటు వివిధ రాష్ట్రాల్లో కేసులు వాదించినందుకు ఆయనకు ముట్టిన ఫీజు అక్షరాలా రూ. 1.86 కోట్లు. ఈ విషయాన్ని గోవా అసెంబ్లీలో శనివారం నాడు వెల్లడించారు. ఈ కేసులకు సంబంధించి.. ఆయన సిబ్బందికి ఇచ్చిన జీతాలు ఇంకా అదనం. అవి దాదాపు రూ. 77.96 లక్షలు ఉన్నాయని న్యాయ శాఖ కూడా చూస్తున్న ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా తెలిపారు. 2013-14 సంవత్సరంలో నదకర్ణికి రూ. 68.65 లక్షలు ఫీజుగాను, రూ. 18.90 లక్షలు ఇతర ఖర్చులుగాను చెల్లించారు.

కొన్ని కేసుల్లో ఆయనకు చెల్లించిన మొత్తాన్ని గౌరవ వేతనం గాను, మరికొన్ని సందర్భాల్లో వృత్తిపరమైన ఫీజుగాను పేర్కొన్నారు. నెలకు 8 లక్షలు సంపాదిస్తూ, దేశంలోనే అత్యధిక సంపాదనపరుడైన న్యాయాధికారిగా ఆయన పేరొందారంటూ ఆర్టీఐ కార్యకర్త ఎయిరెస్ రోడ్రిగ్స్ పలు ఆర్టీఐ దరఖాస్తులు సంధించారు. ఇది రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వచ్చే వేతనం కంటే ఎక్కువన్నారు.

మరిన్ని వార్తలు