మంత్రి భార్య వివాదాస్పద వ్యాఖ్యలు

6 Apr, 2015 13:24 IST|Sakshi
మంత్రి భార్య వివాదాస్పద వ్యాఖ్యలు

పనాజీ: పిల్లల్ని కాన్వెంట్ స్కూల్స్ కు పంపించొద్దంటూ గోవా మంత్రి దీపక్ ధవలికర్ సతీమణి లత వివాదంలో చిక్కుకున్నారు. అత్యాచారాలు పెరగడానికి కారణమవుతున్న పాశ్చాత్య సంస్కృతికి మహిళలు దూరంగా ఉండాలని కూడా ఉచిత సలహాయిచ్చారు. వివాదస్పద సనాతన్ సంస్థలో పనిచేస్తున్న ఆమె మార్గావ్ లో ఆదివారం జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు.

హిందూ పురుషులు బయటకు వెళ్లేటప్పుడు విధిగా తిలకం పెట్టుకోవాలని, మహిళలు కుంకుమ్ పెట్టుకోవాలని సూచించారు. జనవరి ఫస్టు కాకుండా గుడి పడ్వాను నూతన సంవత్సరంగా జరుపుకోవాలన్నారు. పిల్లలను కాన్వెంట్ స్కూల్స్ కు పంపించొద్దని, ఫోన్ లో 'హలో' కు బదులుగా నమస్కారం అనాలని లత సలహాయిచ్చారు. మన సంస్కృతిని కాపాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

అత్యాచారాలు పెరగడానికి కారణమవుతున్న పాశ్చాత్య సంస్కృతిని అనుకరిస్తూ భారత మహిళలు వింతగా తయారవుతున్నారని మండిపడ్డారు. నుదుటిన కుంకుమ పెట్టుకోవడం మానేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శరీర కొలతలు కొట్టొచ్చినట్టు కనబడేలా బిగుతు బట్టలేసుకుంటున్నారని, జడలు వేసుకోవడం మానేసి జుత్తును కత్తిరించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తన భార్య చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు దీపక్ ధవలికర్ నిరాకరించారు. లత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. మతం ప్రాతిపదికన రాష్ట్రాన్ని విడగొట్టే కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించింది.

మరిన్ని వార్తలు