తప్పించుకు తిరుగుతున్న తరుణ్ తేజ్పాల్

29 Nov, 2013 09:10 IST|Sakshi
తప్పించుకు తిరుగుతున్న తరుణ్ తేజ్పాల్

న్యూఢిల్లీ : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ ను అరెస్టు చేసేందుకు గోవా పోలీసులు ఢిల్లీలోని తరుణ్‌ తేజ్‌పాల్‌ ఇంటిలో సోదాలు చేశారు. అయితే  ఈ విషయాన్ని ముందే పసిగట్టిన తేజ్‌పాల్‌ రాత్రి తన ఇంట్లో కాకుండా మరో చోటు మకాం వేశారు. తేజ్‌పాల్‌ను పట్టుకునేందుకు గోవా పోలీసులు తేజ్‌పాల్‌ బంధువులు, మిత్రుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అయితే ఆయన అక్కడ లేకపోవటంతో వారు వెనుదిరిగారు.

గోవా క్రైమ్ బ్రాంచ్ బృందంతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా  సౌత్ ఢిల్లీలోని తరుణ్ తేజ్ పాల్ నివాసంలో సోదాలు జరిపారు. అనంతరం పోలీసులు మాట్లాడుతు తమ విచారణకు తరుణ్ తేజ్ పాల్ కుటుంబీకులు సహకరించటం లేదని, ఆయన ఎక్కడున్నారనే వివరాలు చెప్పేందుకు తరుణ్ తేజ్ పాల్ సతీమణి నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. కాగా తమ ముందు విచారణకు హాజరుకావాలని గోవా పోలీసులు  తేజ్‌పాల్‌కు విధించిన గడువు నిన్నటితో ముగిసింది. అయితే తనకు రెండు రోజుల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ తరుణ్‌ తేజ్‌పాల్‌ పోలీసులకు లేఖ రాశారు. విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ  ఇచ్చారు.

మరోవైపు పోలీసులు  అరెస్టు చేయకుండా నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని హైకోర్టులో తరుణ్‌ తేజ్‌పాల్‌ పెట్టుకున్న  పిటిషన్‌ ఈరోజు విచారణకు రానుంది. కోర్టు బెయిల్‌ ఇవ్వడాని కంటే ముందే  అరెస్టు చేసి విచారణ పూర్తి చేయాలనే  ఆలోచనలో గోవా పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.  ఆ ఉద్దేశ్యంతోనే ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం.

గోవా పోలీసుల రాకను పసిగట్టిన తేజ్‌పాల్‌ వారికి చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఈరోజు బెయిల్ రాకపోతే పోలీసులు ముందు తేజ్ పాల్‌ లొంగిపోయే అవకాశాలున్నాయి. మొత్తం మీద ఢిల్లీలో హైడ్రామా నెలకొంది. చేతిలో నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌తో గోవా పోలీసులు ఢిల్లీలో చక్కర్లు కొడుతుంటే.... ఈరోజు ఎలాగైనా బెయిల్ వస్తుందన్న గంపెడు ఆశతో తేజ్‌పాల్‌ తప్పించుకు తిరుగుతున్నారు.
 

మరిన్ని వార్తలు