షోమా చౌదరికి సమన్లు

5 Dec, 2013 06:08 IST|Sakshi

పణజి: సహోద్యోగినిపై తెహెల్కా పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ లైంగిక దాడి కేసులో ఆ సంస్థ మాజీ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరితో పాటు మరో ముగ్గురు ఉద్యోగుల వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేసేందుకు గోవా పోలీసులు బుధవారం సమన్లు జారీచేశారు. ఈ విషయాన్ని డీఐజీ ఓపీ మిశ్రా పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. అయితే వారి వాంగ్మూలాన్ని ఎప్పుడు రికార్డు చేస్తారనే దానిని మాత్రం వెల్లడించలేదు. కానీ, శుక్రవారం లేదా శనివారం రికార్డు చేయవచ్చని తెలుస్తోంది.
 
అయితే ఉద్యోగానికి రాజీనామా చేయకముందు గోవా పోలీసు బృందం షోమా వాంగ్మూలాన్ని ఢిల్లీలో రికార్డు చేశారు. లైంగిక దాడి సంఘటన తెలిసిన మొదటి వ్యక్తి షోమా కావడంతో ఆమె వాంగ్మూలం చాలా కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. కాగా, పోలీస్ కస్టడీలో ఉన్న తేజ్‌పాల్‌కు బుధవారం ఉదయం రెండో దశ వైద్య పరీక్షలు చేశారు. ఇదంతా విచారణలో భాగంగానే జరుగుతోందని పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా, మరో నెల, నెలన్నరలో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేస్తారని గోవా సీఎం మనోహర్ పారికర్ తెలిపారు.
 
ఫ్యాన్‌కు అనుమతి నిరాకరణ
తేజ్‌పాల్ ఉన్న లాకప్ గదికి ఫ్యాన్ సదుపాయం కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జుడీషియల్ మెజిస్ట్రేట్ కృష్ణ జోషి తోసిపుచ్చారు. మానవతా దృక్పథంతో ఆలోచించి ఫ్యాన్ ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని తేజ్‌పాల్ తరఫు న్యాయవాది సోమవారం ఆ పిటిషన్ దాఖలు చేశారు.
 

మరిన్ని వార్తలు