మెడికల్ రిఫ్రిజిరేషన్‌లోకి గోద్రెజ్

20 Dec, 2013 07:10 IST|Sakshi
మెడికల్ రిఫ్రిజిరేషన్‌లోకి గోద్రెజ్

 న్యూఢిల్లీ: గోద్రేజ్ అప్లయెన్సెస్ సంస్థ మెడికల్ రిఫ్రిజిరేషన్ రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇంగ్లాండ్‌కు చెందిన ష్యూర్ చిల్ కంపెనీ భాగస్వామ్యంతో  ఈ రంగంలోకి అడుగిడుతున్నామని గోద్రేజ్ అప్లయెన్సెస్ సీఓఓ జార్జి మెనెజెస్ తెలిపారు. వచ్చే ఏడాది జూన్ కల్లా  వ్యాక్సిన్ స్టోరేజ్ కోసం రెండు మోడళ్లను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఒకటి వంద లీటర్ల కెసాపిటీ ఉన్న మోడల్ అని, దీంట్లో 3,000 నుంచి 3,500 వరకూ వ్యాక్సిన్‌లను స్టోర్ చేసుకోవచ్చని, ధర రూ.1.35 లక్షల నుంచి రూ.1.5 లక్షల రేంజ్‌లో ఉంటుందని వివరించారు. మరొకటి 50 లీటర్ల కెపాసిటీ ఉన్న మోడల్ అని, దీంట్లో 1,500 నుంచి 1,750 వరకూ వ్యాక్సిన్‌లను స్టోర్ చేసుకోవచ్చని, ధర రూ.65,000 నుంచి రూ.75,000 వరకూ ఉంటుందని పేర్కొన్నారు.
 
ఈ రిఫ్రిజిరేటర్లలో 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో వ్యాక్సిన్‌లను 8 నుంచి 10 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చని వివరించారు. ప్రభుత్వ ఏజెన్సీలకు విక్రయించడం, ప్రైవేట్ రంగ ఆసుపత్రులు, ఫార్మసీ చెయిన్లు, బ్లడ్ బ్యాంకులు లక్ష్యాలుగా వీటిని అందిస్తామని పేర్కొన్నారు. ప్రారంభంలో ముంబైలోని విక్రోలి ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత పుణేలో రూ. 30 కోట్ల పెట్టుబడులతో కొత్తగా నిర్మించే ప్లాంట్‌లో వీటిని తయారు చేస్తామని జార్జి వివరించారు.
 

మరిన్ని వార్తలు