రేపటి నుంచి గోల్డ్ బాండ్లు

4 Nov, 2015 00:53 IST|Sakshi
రేపటి నుంచి గోల్డ్ బాండ్లు

గ్రాము ధర రూ. 2,684 చొప్పున జారీ
ఈ నెల 20 వరకూ కొనుగోలు చేయొచ్చు...
26న కొనుగోలుదార్ల చేతికి బాండ్లు..  రిజర్వ్ బ్యాంక్ ప్రకటన

 
న్యూఢిల్లీ: బంగారం సావరిన్ బాండ్లను గురువారం నుంచి జారీ చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. జారీ ధరను గ్రాముకు రూ.2,684గా నిర్ణయించింది.  గతనెల 26 నుంచి 30వ తేదీ వరకూ ఇండియన్ బులియన్ అండ్ జువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకటించిన 999 ప్యూరిటీ గోల్డ్ ముగింపు ధర సగటును ఆధారంగా చేసుకుని జారీ ధరను నిర్ణయించినట్లు తెలియజేసింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ... పెట్టుబడి తొలి విలువ ప్రాతిపదికన ఈ బాండ్లపై కేంద్రం ప్రకటించిన 2.75 శాతం వార్షిక వడ్డీ కూడా ఉంటుందని తెలియజేసింది. నిజానికి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయలేని వారు దిగులు పడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది తొలివిడత మాత్రమేనని, తదుపరి దశల్లో కూడా బాండ్ల జారీ ఉంటుందని ఆర్‌బీఐ తెలియజేసింది.

ఇవీ ముఖ్యాంశాలు..
నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకూ బ్యాంకులు, నిర్దిష్ట పోస్టాఫీసుల్లో ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చు. కొన్నవారికి 26న బాండ్లు జారీ అవుతాయి.కనీసం 2 గ్రాములు కొనాలి. గరిష్టంగా ఒక వ్యక్తి, ఒక ఆర్థిక సంవత్సరంలో 500 గ్రా. మాత్రమే కొనే వీలుంటుంది. అయితే జాయింట్ హోల్డర్లయితే మొదటి వ్యక్తికి ఈ పరిమితి వర్తిస్తుంది. బాండ్ల కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తరవాత విక్రయించి ‘ఎగ్జిట్’ కావచ్చు. విక్రయించడానికి ముందు వారం (సోమవారం నుంచి శుక్రవారం వరకూ) భారత బులియన్ అండ్ జువెల్లర్స్ అసో సియేషన్ ప్రకటించిన 999 ప్యూరిటీ పసిడి ధర సగటును ధరగా నిర్ణయిస్తారు. కాలపరిమితి తరవాత బాండ్లను నగదుగా మార్చుకునేటపుడు కూడా (రిడంప్షన్) ధరను ఇలాగే నిర్ణయిస్తారు.
     
ఐదేళ్లకు ముందే ఎగ్జిట్ కావాలనుకునే వారి సౌలభ్యం కోసం కమోడిటీ ఎక్స్ఛేంజీలలో ఈ బాండ్ల ట్రేడింగ్ జరుగుతుంది.భారతీయులు సహా భారతీయ సంస్థలు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, ట్రస్టీలు, యూనివర్శిటీలు, దాతృత్వ సంస్థలు మాత్రమే బాండ్ల కొనుగోలు అర్హతను కలిగి ఉంటాయి.రుణాలకు హామీగా కూడా బాండ్లను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం పసిడిపై ఇస్తున్న రుణానికి సంబంధించి ఆర్‌బీఐ విధిస్తున్న నిబంధనలే దీనికీ వర్తిస్తాయి.ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం గోల్డ్ బాండ్లపై వచ్చే వడ్డీకి పన్ను ఉంటుంది. ఫిజికల్ గోల్డ్ తరహాలోనే కేపిటల్ గెయిన్ ట్యాక్స్ అమలవుతుంది. బాండ్ల పంపిణీపై కమిషన్ ‘సబ్‌స్క్రిప్షన్ విలువ’పై ఒక శాతంగా ఉంటుంది.
 
ఇదీ... ప్రభుత్వ లక్ష్యం

 దేశంలో ఏటా దాదాపు 1,000 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చించాల్సి వస్తోంది. దీనితో దేశంలోకి ఫారెక్స్ రాకపోకలకు సంబంధించి కరెంట్ అకౌంట్ లోటు తీవ్ర మయ్యే పరిస్థితులు తలెత్తుతున్నాయి. వీటిని నివారించటమే గోల్డ్ బాండ్ జారీ లక్ష్యం. ఈ తరహా సావరన్ గోల్డ్ బాండ్ పథకాన్ని ఆరంభిస్తామని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ 2015-16 బడ్జెట్‌లో ప్రకటించారు.
 
‘ఇండియా గోల్డ్ కాయిన్లు’ కూడా..
న్యూఢిల్లీ: పండుగ సీజన్‌లో బంగారానికి డిమాండ్ ఉండే నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం.. గోల్డ్ డిపాజిట్ స్కీము, బాండ్ల పథకాలతో పాటు దేశీయంగా తొలి ‘ఇండియా గోల్డ్ కాయిన్’లను ఆవిష్కరించనున్నారు. ఇవి ప్రాథమికంగా 5,10 గ్రాముల పరిమాణంలో లభ్యమవుతాయి. 20 గ్రాముల పరిమాణంతో కడ్డీల రూపంలోనూ లభిస్తాయని ఆర్థిక శాఖ తెలిపింది. ఎంఎంటీసీ అవుట్ లెట్స్‌లో 5 గ్రాముల నాణేలు 15,000.. 10 గ్రా. నాణేలు 20,000, కడ్డీలు 3,750 అందుబాటులో ఉంటాయని వివరించింది. నకిలీల తయారీకి ఆస్కారం ఉండని విధంగా అశోక చక్ర ముద్రతో కూడిన నాణేలను రూపొందించినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. బంగారం డిపాజిట్ స్కీముకు సంబంధించి వడ్డీ రేటు మధ్యకాలిక డిపాజిట్లపై (5-7 ఏళ్లు) 2.25%గాను, దీర్ఘకాలిక డిపాజిట్లపై (12-15 ఏళ్ల వ్యవధి) 2.50%గా ఉంటుందని ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఈ కాలావధి గల డిపాజిట్లను కేంద్ర ప్రభుత్వం తరఫున బ్యాంకులు స్వీకరిస్తాయని పేర్కొంది. 22 క్యారట్ల స్వచ్ఛత గల బంగారాన్ని కనిష్టంగా 30 గ్రాములు డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు.
 
గోల్డ్ ఈటీఎఫ్‌ల ట్రేడింగ్ పొడిగింపు
 
ధన త్రయోదశి రోజున రాత్రి 7 గం. వరకూ ట్రేడింగ్ సెషన్
న్యూఢిల్లీ: ధన త్రయోదశి (ఈ నెల 9వ తేదీ-సోమవారం) సందర్భంగా గోల్డ్ ఈటీఎఫ్(ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్) ట్రేడింగ్ సెషన్‌ను ఎన్‌ఎస్‌ఈ ఏడు గంటల వరకూ పొడిగించింది. ఈ పొడిగింపు గోల్డ్ ఈటీఎఫ్‌లకు మాత్రమే వర్తిస్తుందని ఎన్‌ఎస్‌ఈ పేర్కొంది. సాధారణంగా ట్రేడింగ్ సెషన్ ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 3.30 వరకూ ఉంటుంది. అయితే ధన త్రయోదశి రోజు మాత్రం గోల్డ్ ఈటీఎఫ్‌ల ట్రేడింగ్ మళ్లీ సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకూ  కొనసాగుతుందని తెలియజేసింది. బీఎస్‌ఈ కూడా గోల్డ్ ఈటీఎఫ్ ట్రేడింగ్ సెషన్‌ను రాత్రి 7 గంటల వరకూ పొడిగిస్తున్నట్లు సోమవారమే వెల్లడించింది.
 
విజయవంతమవుతుంది: ఇండియా రేటింగ్

గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, గోల్డ్ బార్స్ వంటి పెట్టుబడి సాధనాలతో పోలిస్తే సావరిన్ గోల్డ్ బాండ్ల స్కీమ్ (ఎస్‌జీబీఎస్) ఇన్వెస్టర్లను ఆకర్షించడంలో ముందుంటుందని ఇండియా రేటింగ్ పేర్కొంది. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ మాదిరిగానే గోల్డ్ బాండ్ల స్కీమ్ అమలు కూడా సులభంగా ఉంటుందని తెలిపింది. గోల్డ్ బాండ్ల స్కీమ్ ప్రారంభం వల్ల బంగారు ఆభరణాల తయారీకి ఫిజికల్ గోల్డ్‌ను, పెట్టుబడి కోసం గోల్డ్ బాండ్లను ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటారని తెలియజేసింది. నిల్వ, నిర్వహణ వ్యయాలు, నాణ్యత పరిశీలన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే... గోల్డ్ బార్స్, నాణేలపై పెట్టుబడిపెట్టే ఇన్వెస్టర్లు వారి ప్రాధాన్యాన్ని ఇక గోల్డ్ బాండ్లవైపు మరలిస్తారని అభిప్రాయపడింది.
 
 

మరిన్ని వార్తలు