పథకాలన్నీ కలిస్తేనే పొదుపు..

17 Nov, 2013 02:56 IST|Sakshi
పథకాలన్నీ కలిస్తేనే పొదుపు..

సంక్షోభాల్లో బంగారం
 సంక్షోభాల్లో బంగారం అక్కరకు వస్తుందనేది చాలామంది వాదన. అందుకే దేశీయంగా లేదా అంతర్జాతీయంగా ఏదైనా ఆర్థిక సంక్షోభం వస్తే బంగారంలో ఇన్వెస్ట్ చేయడం మేలని సూచిస్తారు. కాని ఇందులో చాలా మంది ప్రజల్లో నెలకొన్న భయాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే అలా సలహా ఇస్తారు కాని, నిజంగా ఆ ఇన్వెస్టర్‌కి బంగారం ఉపయోగకరంగా ఉందా లేదా అన్న అంశాన్ని పరిశీలించరు.  ఈక్విటీలు, డెట్ పథకాలు మాదిరే పుత్తడి కూడా ఒక విలువైన ఇన్వెస్ట్‌మెంట్ సాధనమే. ప్రతీ ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో బంగారం ఉండే విధంగా చూసుకోవాలి. అంతే కాని మొత్తం పెట్టుబడి అంతా బంగారంలోకి మార్చేయకూడదు. సాధారణంగా మొత్తం పెట్టుబడుల విలువలో బంగారం వాటా 5-10 శాతం వరకు ఉంటే సరిపోతుంది. సంక్షోభ సమయాల్లో కూడా ఈ వాటాలో ఎలాంటి మార్పులు ఉండవు. ఒకవేళ ఇప్పటికే మీ పోర్ట్‌ఫోలియోలో బంగారం తగినంత ఉంటే... పుత్తడిలో పెట్టుబడులు పెట్టండి అంటూ వచ్చే సూచనలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
 బాండ్స్ మేలు
 దేశ ఆర్థిక వ్యవస్థ ఒత్తిడికి లోనవుతున్నప్పుడు బాండ్స్‌లో పెట్టుబడి పెడితే కనీసం అసలుకు రక్షణ ఉంటుందని చాలా మంది భావిస్తారు. కాని ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాల సమయంలో దీర్ఘకాలిక బాండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా నష్టాలను అందిస్తాయి. ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు, రూపాయి-డాలర్ కదలిక, కరెంట్ అకౌంట్ లోటు వంటి అనేక కీలక గణాంకాలు బాండ్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి సంక్షోభ సమయంలో లాంగ్‌టర్మ్ బాండ్స్, డెట్ పథకాలు సురక్షితమైనవన్న వాదన నిజం కాదు. వీటిల్లో కూడా నష్టాలు ఉంటాయన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి.
 రేటింగ్ ఫండ్స్
 బాండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వలే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ పథకాలకు కూడా రేటింగ్‌ను ఇస్తున్నారు. గత కొంత కాలంగా పథకాలు అందించిన రాబడుల ఆధారంగా ఈ రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాని ఫైవ్‌స్టార్ రేటింగ్ ఉన్న పథకం ఆ తర్వాతి కాలంలో కూడా అదే విధమైన లాభాలను గ్యారంటీగా అందిస్తుందన్న శాస్త్రీయ ఆధారం ఏదీ లేదు. రేటింగ్ తర్వాత ఆ పథకం అంతకంటే ఇంకా మెరుగైన లాభాలు అందించొచ్చు లేకపోతే నష్టాలను కూడా ఇవ్వొచ్చు. మరి రేటింగ్‌తో కలిగే ప్రయోజనం ఏమిటంటే... ప్రస్తుతం బాగా పనిచేస్తున్న పథకాలను సాకల్యంగా పరిశీలించే వీలుకలుగుతుంది. వీటిలో మీ పోర్ట్‌ఫోలియోకు సరిపడే పథకాన్ని ఎంచుకుంటే సరిపోతుంది.
 ఈక్విటీలూ ఉండాల్సిందే
 ఒక్కసారి మార్కెట్లు పడటం మొదలైతే లాభాలన్నీ హరించుకుపోవడమే కాకుండా భారీ నష్టాలు కూడా వస్తాయన్న ఉద్దేశంతో చాలా మంది ఈక్విటీల గురించి భయపడుతుంటారు. కాని ఇవి ద్రవ్యోల్బణం వంటి సమస్యలకు చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాయన్న అంశాన్ని గుర్తించరు. ఉదాహరణకు సగటు ద్రవ్యోల్బణం (అంటే ధరల పెరుగుదల) 6 శాతం, ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 8 శాతం ఉందనుకుందాం. ఈ పరిస్థితుల్లో నికరంగా మీకు వచ్చే వడ్డీ రెండు శాతం మాత్రమే. ఇక్కడ అసలుకు ఎటువంటి ఢోకా ఉండదు కాని ద్రవ్యోల్బణం వల్ల మీ కొనుగోలు శక్తి క్రమేపీ తగ్గిపోతుంటుంది. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి బ్యాలెన్సింగ్‌గా మీ పోర్ట్‌ఫోలియోలో ఈక్విటీలకు కూడా చోటు కల్పించండి.

>
మరిన్ని వార్తలు