దొంగ చిరునామాలతో ఎంత పని చేశారు !

31 Aug, 2017 15:58 IST|Sakshi
దొంగ చిరునామాలతో ఎంత పని చేశారు !

న్యూఢిల్లీ: విదేశాల నుంచి దొడ్డిదారిన దేశంలోకి తరలిస్తున్న బంగారం భారీగా పట్టబడింది. ఇందుకు దేశ రాజధానిలోని ఫారిన్‌ పోస్టాఫీసు, ప్రధాన పోస్టాఫీసులు వేదిక కావటం గమనార్హం.  థాయ్‌లాండ్‌, టర్కీ, దుబాయి, హాంగ్‌కాంగ్‌, ఇండోనేసియా, వంటి దేశాల నుంచి నిషేధిత వస్తువలను పోస్టు ద్వారా కొందరు తీసుకువస్తున్నారు. ఇలా వచ్చే పార్సిళ్లపై దొంగ చిరునామాలుంటాయి. అయితే ఇది ముందే పోస్టాఫీసు సిబ్బందికి తెలిసి ఉంటుంది.

 ఆ ప్రకారమే సంబంధిత వ్యక్తికి ఆ పార్శిల్‌ అందుతుంది. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న రెవెన్యూ ఇంటలిజెన్స్ విభాగం అధికారులు గురువారం ఢిల్లీలోని ఫారిన్‌ పోస్టాఫీసుపై దాడి చేసి రూ.15 కోట్ల విలువైన బంగారం సహా నిషేధిత వస్తువులను పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఒక అధికారితో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు.

వారు చెప్పిన సమాచారం మేరకు రెండు ముఠాలకు చెందిన వ్యక్తులను పట్టుకుని రూ.8.5 కోట్ల విలువైన 28 కిలోల బంగారంతోపాటు రూ. 5 కోట్ల విలువైన డ్రగ్స్‌, ఇతర విలువైన  వస్తువులను సీజ్‌ చేశారు. ఈ సిండికేట్‌ గుట్టురట్టు చేయటానికి తమకు నాలుగు రోజులు పట్టిందని అధికారులు తెలిపారు. అంతేకాక వారి నుంచి లెక్క చూపని రూ. 24 లక్షల నగదు కూడా దొరికిందని వివరించారు.

మరిన్ని వార్తలు