జోరుగా వెండి, బంగారం ధరలు

15 Apr, 2017 16:38 IST|Sakshi
జోరుగా వెండి, బంగారం ధరలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి.  అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక అనిశ్చితి నేపథ్యంలో ఈ విలువైన లోహానికి డిమాండ్‌ పుంజుకుంది. బులియన్‌ మార్కెట్‌లో దేశీయంగా పసిడి ధరలు  మళ్లీ రూ.30వేల స్థాయికి వైపు కదులుతున్నాయి.
గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం జిగేల్‌మంటుండటంతో దేశీయంగానూ ఆ ప్రభావం పడింది.  స్తానిక బంగారం వర్తకుల డిమాండ్‌ దీనికి తోడవ్వడంతో దేశీయంగా  పది గ్రా. బంగారం ధర రూ. 29,950 స్థాయిని తాకింది.  మరో విలువైన  మెటల్‌ వెండి కూడా ఇదే బాటలో పయనిస్తోంది. కిలో వెండి  ధర రూ.100 లాభపడి రూ.43వేల వద్ద స్థిరంగా ఉంది.  వివాహ సీజన్‌, స్థానిక రీటైల్‌ వ్యాపారస్తుల  డిమాండ్‌ కారణంగా బంగారం ధరలు,  పరిశ్రమదారులు, నాణేల ఉత్పత్తిదారుల డిమాండ్‌  నేపథ్యంలో వెండి ధరలు పైకి ఎగబాకుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

శనివారం దేశరాజధానిలో 99.9 శాతం స్వచ్ఛత , 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం  10 గ్రాముల ధరలు వరుసగా రూ రూ.29,950 , రూ 29,800గా నమోదయ్యాయి. గత నాలుగు రోజులలో రూ.660లు లాభపడింది. అయితే, సావరీన్‌ ఎనిమిది గ్రాముల బంగారం ధర రూ.24,500 వద్ద స్థిరంగా ఉంది.  అటు ఏంసీఎక్స్‌ మార్కెట్‌ లో పుత్తడి పది గ్రా. 193  లాభపడి రూ. 29,422 వద్ద ఉంది. ప్రపంచవ్యాప్తంగా  ఔన్సుబంగారం 0.09 శాతం 1,287.80 డాలర్లు పలుకుతోంది. గురువారం న్యూయార్క్‌లోని కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం 0.8 శాతం(10 డాలర్లు) పెరిగి 1,288 డాలర్లను అధిగమించింది.

 

>
మరిన్ని వార్తలు