బంగారం ఎక్కడ దాచారంటే..

19 Jan, 2017 11:04 IST|Sakshi
బంగారం ఎక్కడ దాచారంటే..

న్యూఢిల్లీ:   బంగారం అక్రమ రవాణాలో అక్రమార్కుల తీరు నిఘా అధికారులను  సైతం నివ్వెర పరుస్తోంది.  బేబీ డైపర్స్ నుంచి  శరీర అవయవాలు దాకా  దేన్నీ వదలకుండా  పసిడి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.  తాజాగా ఢిల్లీ విమానాశ్రయంలో  తనిఖీలు నిర్వహిస్తున్న కస్టమ్స్ అధికారులకు ఇలాంటి షాకింగ్ అనుభవం ఎదురైంది. ఇందిరాగాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో  ఓ వింత చెప్పు అధికారులను ఆకర్షించింది.   అనుమానంతో ఆరాతీస్తే సుమారు రూ. 27 లక్షల విలువైన బంగారం పట్టుబడింది.  ఇండియన్ పాస్ పోర్ట్ తో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న  ఇద్దరు ప్రయాణికులనుంచి బుధవారం దీన్ని  స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా కనిపించే   స్లిప్పర్స్ లో భారీగా బంగారం పట్టుబడటం  అక్రమార్కుల  అనుసరిస్తున్న విధానానికి అద్దం పట్టింది.  అయినా....చివరికి  నిఘా కన్నుకు చిక్కక తప్పలేదు.

బ్యాంకాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్న వీరినుంచి  938 గ్రాముల ఈ బంగారాన్నిఅధికారులు సీజ్ చేశారు.  118  చిన్న చిన్న ముక్కలుగా చెప్పుల్లోదాచి పెట్టిన ఈ  బంగారం  మార్కెట్ విలువ  రూ.26.96లక్షలని  అధికారులు తెలిపారు.  కస్టమ్స్  చట్టం 1962 110  సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ కేసులో ఇరువురిని అనుమానితులుగా అదుపులోకి విచారిస్తున్నారు.  

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన డీమానిటైజేషన్ తరువాత బంగారం అక్రమ రవాణా బాగా పెరిగింది. అనేక రెట్లు పెరిగి పోయిందని అధికారులు చెబుతున్నారు. ఈ వారంలోనే  దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడినుంచి అట్టపెట్టెల్లో నల్లని ఇన్సులేట్ టేప్ తో అతికించిన  గోల్డ్ ఫాయిల్స్ ను అధికారులు స్వాదీనం చేసుకున్నారు.  700 గ్రాములున్న దీని విలువ రూ.18.5 లక్షలు.

ఢిల్లీ విమానాశ్రయం నుంచి 2012-2013 కాలంలో 6.6 కిలోల బంగారం స్వాధీనం చేసుకోగా,   2013-2014 లో ఇది 384 కేజీలు పెరిగింది. 2014, 15 సంవత్సరాల్లో  574 కిలోలుగా ఉంది. అయితే  2016 లో మాత్రం 220 కిలోలకు పైగానే  అధికారులకు చిక్కింది. దీని విలువ సుమారు రూ 60 కోట్లు.

మరిన్ని వార్తలు