భారీగా పెరిగిన ఎంపీల వేతనాలు

2 Nov, 2016 10:48 IST|Sakshi
భారీగా పెరిగిన ఎంపీల వేతనాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యులకు శుభవార్త. ఎంపీల వేతనాలు 100 శాతం  పెంపుకు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) ఆమోదం తెలిపింది. దీంతో పార్లమెంట్ సభ్యులకు ప్రస్తుతమున్న వేతనం రూ.50 వేల నుంచి రెండింతలు పెరిగి లక్ష రూపాయలకు చేరుకుంది. కేవలం వేతనాలను మాత్రమే కాక, అలవెన్స్లను కూడా పీఎంవో సమీక్షించింది. పీఎంవో ఆమోదంతో మొత్తంగా పార్లమెంట్ సభ్యులు అందుకునే వేతనాలు నెలకు రూ.1,90,000 నుంచి రూ.2,80,000 కు ఎగిశాయి. ఈ వేతన ప్రతిపాదనను బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యానాథ్ అధినేతగా పార్లమెంట్ సభ్యుల వేతన, అలవెన్స్ జాయింట్ కమిటీ రూపొందించింది. 
 
అంతకముందు ఎంపీల వేతన పెంపుకు ప్రధాని మోదీ ఓ ప్రత్యేక కమిషన్ను ఏర్పాటుచేశారు. కానీ పార్లమెంట్ సభ్యుల నుంచి వచ్చిన ఒత్తిడి క్రమంలో ఈ కమిషన్ను మోదీ రద్దుచేశారు.  పార్లమెంట్ సభ్యుల అలవెన్స్ చూసుకుంటే, ప్రతినెలా వారికి ఇచ్చే నియోజకవర్గ భత్యం రూ.45,000 ల నుంచి రూ.90,000కు పెరిగింది. సెక్రటరీ సహాయం, కార్యాలయ భత్యం కింద నెలకు రూ. 90,000ను పార్లమెంట్ సభ్యులు అందుకోనున్నారు. అదేవిధంగా రాష్ట్రపతి వేతనాన్ని కూడా రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రపతి వేతనంతో పాటు గవర్నర్ వేతనాన్ని కూడా రూ.1.10 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచనున్నారు. 
మరిన్ని వార్తలు