చక్కని ఉద్యోగం.. భూకంపానికి చిక్కాడు

26 Apr, 2015 08:45 IST|Sakshi
చక్కని ఉద్యోగం.. భూకంపానికి చిక్కాడు

శాన్ ఫ్రాన్సిస్కో: అతడిది చక్కటి ఉద్యోగం.. అదీకూడా గుగూల్ సంస్థలో ఎగ్జిక్యూటివ్ గా.. కాకపోతే అతడికి పర్వతారోహణల పిచ్చి కూడా ఉంది. అదే అతడి ప్రాణం మీదకు తెచ్చింది. నేపాల్లో సంభవించిన భూకంపం కారణంగా గూగుల్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ అధికారి ఒకరు చనిపోయారు. స్వతహాగా సాహసికుడు అయిన డాన్ ఫ్రెడిన్ బర్గ్ హిమాలయ పర్వతాల్లో ఎవరెస్టు పర్వతారోహణకు వెళ్లే క్రమంలో బేస్ క్యాంపు వద్ద ప్రాణాలు కోల్పోయాడు. హిమాలయాలు మొత్తం కంపించడంతో భారీ ఎత్తున  కొండ చరియలు కూడా విరిగి పడిన విషయం తెలిసిందే. ఇవి డాన్ ఉన్న బేస్ క్యాంపుపై పడటంతో డాన్తో సహా మొత్తం పది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ విషయాన్ని గూగుల్ సంస్థ స్వయంగా ప్రకటించింది. చాలా కాలంగా గూగుల్ ప్రైవసీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. స్నేహితులు, తోటి ఉద్యోగులతో కలిసి మౌంట్ ఎవరెస్టును అధిరోహించే ప్రయత్నంలో ఉండగా డాన్ ప్రాణాలు కోల్పోయాడు. డాన్ తోపాటు ఉన్న మరో  ముగ్గురు గూగుల్ ఉద్యోగస్తులు ప్రాణాలతో బయటపడ్డారు. వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. డాన్ తలకు బలమైన గాయం అవడం వల్ల ప్రాణాలు విడిచాడని అతడి సోదరి తెలిపింది.

మరిన్ని వార్తలు