హెల్త్‌కార్డులపై చర్చలు విఫలం

1 Nov, 2013 02:31 IST|Sakshi
హెల్త్‌కార్డులపై చర్చలు విఫలం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్‌కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పీకే మహంతి గురువారం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. గత నాలుగేళ్లలో ఈ అంశంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం 25 సార్లు చర్చలు జరిపినప్పటికీ.. వైద్య సేవలకు నగదు రహిత సౌకర్యం అందించే విషయంలో పరిమితి, అవుట్ పేషంట్ సేవల చేర్పు.. అంశాల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన హెల్త్‌కార్డుల జారీ విధి విధానాలపై వివిధ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో గురువారం సీఎస్ చర్చించారు. ఈ సందర్భంగా నగదు రహిత వైద్యానికి సంబంధించిన పరిమితి అంశంలో ఉద్యోగ సంఘాల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
 
  గతంలో ప్రకటించినట్లుగా రూ.2 లక్షల పరిమితితో హెల్త్‌కార్డులు అందించేలా తక్షణమే జీవో జారీ చేసి దీపావళి కానుకగా ఇవ్వాలని సచివాలయ ఉద్యోగుల సమాఖ్య ప్రతినిధులు కోరారు. పరిమితిలేని నగదు రహిత వైద్యం అందించేలా హెల్త్‌కార్డులు జారీ చేయాలని, పరిమితి పెడితే కార్డులు తీసుకునే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏపీఎన్‌జీవో), తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీఎన్‌జీవో)లు స్పష్టం చేశాయి. ఇదే అంశాన్ని ఆయా సంఘాల ప్రతినిధులు మీడియా సమావేశంలోనూ ప్రకటించారు. ‘రూ. 2 లక్షల పరిమితితోనైనా దీపావళి కానుకగా హెల్త్‌కార్డులు అందించేలా తక్షణమే జీవో జారీ చేయాలి. ఏమైనా లోపాలు ఉంటే తరువాత సవరించుకోవచ్చు అని సీఎస్‌కు చెప్పాం. దీనిపై మంత్రివర్గ ఉపసంఘంతో, ముఖ్యమంత్రితో చర్చించి వీలైనంత త్వరగా జీవో ఇస్తామని సీఎస్ హామీ ఇచ్చారు’ అని సచివాలయ ఉద్యోగుల సమాఖ్య (తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాలన్నీ ఇందులో ఉన్నాయి) ప్రతినిధులు మురళీ కృష్ణ, నరేందర్‌రావు, సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.పద్మాచారి తెలిపారు.  
 
 పరిమితి పెడితే కార్డులు తీసుకోం
 ‘నగదు రహిత వైద్యానికి సంబంధించి ఎలాంటి పరిమితి లేకుండా హెల్త్‌కార్డులు జారీచేయాలని డిమాండు చేశాం. ఆస్పత్రులకు వైద్య ప్యాకేజీల విషయంలో ప్రభుత్వం ఎలాంటి పరిమితినైనా పెట్టుకోవచ్చు. ఉద్యోగుల వైద్యానికి మాత్రం పరిమితి ఉండరాదని స్పష్టం చేశాం. పరిమితి విధిస్తే మాత్రం కార్డులు తీసుకునే ప్రసక్తే ఉండదని తేల్చిచెప్పాం. దీనిని అమలు చేసే ట్రస్టులోనూ ఉద్యోగుల భాగస్వామ్యం 50 శాతం తగ్గకుండా ఉండాలని కోరాం. ముఖ్యమంత్రితోనూ, మంత్రివర్గ ఉపసంఘంతోనూ చర్చించి వీలైనంత త్వరగా ఉత్తర్వులు ఇస్తామని సీఎస్ చెప్పారు’ అని ఏపీఎన్‌జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు, టీఎన్‌జీవో అధ్యక్షుడు  దేవీప్రసాద్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ వేర్వేరుగా మీడియాకు వివరించారు.

>
మరిన్ని వార్తలు